క్లీన్ ఎనర్జీ పరిశ్రమలకు అసైన్డ్ భూములు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:59 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు గురువారం శాసనసభ ఆమోదం పొందింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బిల్లును...
చట్ట సవరణకు శాసనసభ ఆమోదం
పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి: స్పీకర్, ఎమ్మెల్యేలు
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు గురువారం శాసనసభ ఆమోదం పొందింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ బిల్లును సభలో ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగీవంగా ఆమోదం తెలిపారు. అనగాని మాట్లాడుతూ ‘విశాఖలో డేటా సెంటర్ల కోసం క్లీన్ ఎనర్జీ పరిశ్రమల ఏర్పాటు చాలా కీలకం. దేశంలోనే తొలిసారిగా అనకాపల్లిలో గీన్ర్ హైడ్రోజన్ వ్యాలీతో పాటు కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌ను కూడా ప్రారంభించాం. పునరుత్పాదక విద్యుత్తు (క్లీన్ ఎనర్జీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు రూ.10లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ గ్రౌండ్ అయితే 7.5లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం తీసుకునే అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.31వేల లీజు చెల్లిస్తాం. ప్రతి రెండేళ్లకు ఒకసారి 5శాతం లీజు పెంచుతాం. రాష్ట్రంలో చాలాచోట్ల అసైన్డ్ భూములు బంజరు భూములుగానే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా లబ్ధిదారులకు నికర ఆదాయం లభిస్తుంది’ అని వివరించారు. బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, డి.పార్థసారథి, కొండ్రు మురళీమోహన్ మాట్లాడారు. పరిశ్రమల కోసం అసైన్డ్ భూములు తీసుకునేటప్పుడు పేదలకు అన్యాయం జరగకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు’గా పేరు మారుస్తూ ఆ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రతిపాదించిన చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఏగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనిపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు(గణబాబు), కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు.