Share News

అయ్యో.. రొయ్య!

ABN , Publish Date - May 25 , 2026 | 04:05 AM

ఆక్వా రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. మేత ధరలు పెరుగుతుండగా, రొయ్యల ధరలు మాత్రం పడిపోతున్నాయి. దీంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

అయ్యో.. రొయ్య!

  • మేత ధర పైపైకి.. రొయ్య ధర కిందికి

  • నష్టాలతో ఆక్వా రైతులు విలవిల.. 15 రోజులలో 100 కౌంటు ధర 270 నుంచి 215కు

  • ఫీడ్‌, ఎగుమతిదారుల సిండికేట్‌.. ఉద్యమం దిశగా రొయ్యల రైతులు

  • మండుటెండలో రోడ్డెక్కి నిరసన గళం.. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విన్నపం

ఆకివీడు రూరల్‌/నిడమర్రు/పాలకొల్లు రూరల్‌/

భీమవరం, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. మేత ధరలు పెరుగుతుండగా, రొయ్యల ధరలు మాత్రం పడిపోతున్నాయి. దీంతో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. రొయ్యల సీడ్‌, ఫీడ్‌, ఎగుమతిదారులు అందరూ సిండికేట్‌ అయి రైతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇటీవల రొయ్యల మేత ధరలు పెరిగాయని రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం స్పందించి కట్టడి చేసింది. మేత ధరలు పెంచనివ్వలేదని కన్నెర్ర చేసిన సిండికేట్‌.. ఇప్పుడు రొయ్యల ధరలు తగ్గించేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో 100 కౌంటు ధర రూ.270 నుంచి రూ.215కు తగ్గించడంపై మండిపడుతున్నారు. రేయింబవళ్లూ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాలతోనే అమ్ముకొంటున్నారు. కనీస ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. రూ.21,246 కోట్ల విలువైన సరుకు ఎగుమతి అవుతోంది. దేశంలో రాష్ట్ర వాటా 34 శాతం కాగా, ఇందులో అత్యధిక భాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే సాగు జరుగుతోంది. సాధారణంగా రొయ్య పంటకు జనవరి మాసం అనువైన కాలం. సంక్రాంతి తర్వాత వాతావరణంలో మంచు శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడుతుంది. రొయ్యకు ఇది సరిగా సరిపోతుందని భావించి పంటను ఎక్కువగా వేస్తారు. ఈ వేసవిలో రొయ్యల్లో గ్రోత్‌ కూడా బాగా వస్తుందన్నది రైతుల ఆశ. ఎండ, ఉక్కపోతలను లెక్కచేయక చెరువుల వద్దే పడిగాపులు పడుతూ పంట పండించినా రొయ్య కొనుగోలు రేట్లు తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.


అన్నీ ప్రతికూలతలే

ఏడాది కాలంగా రొయ్యల మేత ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత ఏడాది టన్ను రొయ్య మేత ధర రూ.65-75 వేలు ఉండగా, ఇప్పుడు 90-95 వేలకు పెంచారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. టన్నుకు అదనంగా రూ.20 వేలు భరించాల్సి వస్తోంది. ఇక రొయ్య రేటు తగ్గుదల వల్ల టన్నుకు రూ.45 వేల రూపాయలు నష్టపోతున్నాడు. ఒకప్పుడు రొయ్య మేత షాపుల వాళ్లు అరువులు ఇచ్చి పంట పండాక జమ చేసే అవకాశం కల్పించేవారు. కానీ నేడు ఆక్వా పరిశ్రమ పూర్తిగా దెబ్బతినడం వల్ల రైతులపై నమ్మకం సన్నగిల్లిన మేతల కంపెనీ ఏజెంట్లు, ఫీడ్‌ షాపుల వాళ్లు సొమ్ములు చెల్లిస్తేనే మేతలు ఇస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు తమ పంటను కాపాడుకోవడం కోసం అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నారు. రొయ్య రైతుల పరిభాషలో.. 100 కౌంట్‌ పడితే ఆ చెరువు సేఫ్‌లో ఉన్నట్టేనని గతంలో చెప్పేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు 100 కౌంట్‌కు రూ.215, 90 కౌంట్‌కు రూ.225, 80 కౌంట్‌కు రూ.235, 70 కౌంట్‌కు 250, 60 కౌంట్‌కు రూ.265, 50 కౌంట్‌కు రూ.275, 40 కౌంట్‌కు రూ.305, 30 కౌంట్‌కు రూ.365 పలుకుతున్నాయి.


రైతులు ఆందోళన బాట

ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు ఉద్యమబాట పట్టారు. పాలకొల్లు, భీమవరం, ఉండిలలో రొయ్యలను రోడ్డుపై పారవేసి నిరసన తెలియజేశారు. రొయ్యల ధరలు పతనమవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారని, సిండికేట్‌ మాయాజాలాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని కోరుతున్నారు. సిండికేట్‌ను నియంత్రించి ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చి క్రాప్‌ హాలీడే ప్రకటించేందుకు సిద్ధమవుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్‌ సబ్సిడీ హామీని తుంగలో తొక్కారని, సబ్సిడీపై ట్రాన్స్‌ఫార్మర్లు, వివిధ పరికరాలు పంపిణీ చేయలేదని అంటున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు.


29న రాష్ట్ర ఆక్వా రైతుల సదస్సు

రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 29న అమలాపురంలో ఏపీ రాష్ట్ర ఆక్వా రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు పాలకొల్లు జై భారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం చైర్మన్‌ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు తెలిపారు. శనివారం పాలకొల్లులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆక్వా సంఘాల నుంచి రైతులు సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ఫీడ్‌, సీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు వివరించారు. రొయ్యల ధర తగ్గించి కొనుగోలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. మేత ధర పెంచి విక్రయిస్తున్న కంపెనీలను బహిష్కరిస్తామన్నారు. రొయ్య సాగు చేస్తున్న ఆక్వా రైతులకు న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే క్రాప్‌ హాలిడే ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.


తక్కువ ధరలకు అమ్మొద్దు

అంతర్జాతీయంగా ఈక్విడార్‌, ఇతర దేశాల్లో రొయ్యల ధరలు తగ్గినప్పటికీ రాష్ట్రంలో రైతులను దృష్టిలో ఉంచుకుని నికరమైన ధరలను నిర్ణయించినట్టు భారత సముద్ర ఆహార ఉత్పత్తుల అసోసియేషన్‌(ఎ్‌సఈఏఐ) ఏపీ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రైతులకు మద్దతుగా 100 కౌంట్‌ ధర రూ.230, 40 కౌంట్‌ ధర రూ.330, 30 కౌంట్‌ ధర రూ.430గా నిర్ణయించినట్టు అసోసియేషన్‌ ఏపీ అధ్యక్షుడు ఆనంద్‌ తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఇదే ధర ఉంటాయని, ఇంతకంటే తక్కువ ధరలకు రైతులు విక్రయించరాదని, ముందుగానే చిన్న సైజు రొయ్యలను పట్టుబడులు చేయవద్దని కోరారు.


మార్కెట్‌ డౌన్‌ చేయడం దారుణం

రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర లభించడం లే దు. దీనివల్ల లక్షల రూపా యలు నష్టపోతున్నారు. పెట్టుబడి సొమ్ములు రాక ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు 100 కౌంట్‌ ధర 270-275 రూపాయలు ఉండగా, నేడు రూ.215కి పడిపోయింది. మార్కెట్‌ను డౌన్‌ చేయడం దారుణమైన విషయం. ప్రభుత్వం ప్రతి మండలానికి కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయడం ద్వారా రైతు తన పంటను నిల్వ చేసుకొని తగిన రేటు వచ్చాక అమ్ముకొనే సదుపాయం కల్పించాలి. పెరుగుతున్న మేతల రేట్లు, మరోవైపు పడిపోతున్న రొయ్య రేటు రైతులను నిరాశలోకి నెడుతున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర ఉండేలా చర్యలు తీసుకోవాలి.

- రుద్రరాజు శివరామరాజు, ఆక్వా రైతు,

ఫత్తేపురం(నిడమర్రు)

టన్నుకు 35 వేలు నష్టం

100 కౌంట్‌ 215 రూపాయలకు అమ్మితే టన్ను రొయ్యకు సుమారు రూ.35 వేలకుపైగా నష్టం వస్తోంది. వేసవిలో రొయ్యల సాగులో ఉత్పత్తి ఎక్కువ రావడం వల్ల ట్రేడర్స్‌ రేటు తగ్గించి వేస్తున్నారు. పంట ఖర్చులు రాకపోతే రైతు సాగు ఎలా చేయగలడు? ఎంపెడా, ఆక్వా అథారిటీ వారు వెంటనే తగిన చర్యలు తీసుకొని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి.

- గోలిసాయి పుండరీకాక్షుడు,

ఆక్వా రైతు, అడవికొలను

Updated Date - May 25 , 2026 | 04:07 AM