Share News

దాణా ధర తగ్గించాలి: ఆక్వా రైతుల డిమాండ్‌

ABN , Publish Date - May 16 , 2026 | 04:56 AM

రొయ్యల దాణా తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగినందున ధరలు పెంపు అనివార్యమని కంపెనీల ప్రతినిధులు పేర్కొనగా, ఏకపక్షంగా ధరలను పెంచే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఆక్వా రైతులు స్పష్టం చేశారు.

దాణా ధర తగ్గించాలి: ఆక్వా రైతుల డిమాండ్‌

  • రొయ్యల మేత ధర పెంపుపై విస్తృతస్థాయి సమావేశం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగినందున ధరలు పెంపు అనివార్యమని కంపెనీల ప్రతినిధులు పేర్కొనగా, ఏకపక్షంగా ధరలను పెంచే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఆక్వా రైతులు స్పష్టం చేశారు. రొయ్యల మేత ధర పెంపుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రఽత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఆక్వా రైతుల ప్రతినిధులు మాట్లాడుతూ, మేత ధరలు పెంచడం అంటే రైతులపై మరింత భారం మోపినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముడి పదార్ధాల ధరలు నిరంతరం పెరుగుతున్నందున దాణా ధరలు పెంచక తప్పడంలేదని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. అయితే గత ఫిబ్రవరిలోనే ధరలు పెంచారని, ఇప్పుడు మళ్లీ పెంచడం సరికాదని రైతు ప్రతినిధులు వాదించారు. దాణా ధరలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టడం లేదని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాకిష్‌వాటర్‌ ఆక్వా కల్చర్‌(సిబా) ప్రతినిధులను ఆక్వా రైతులు నిలదీశారు. ఈ సమయంలో అధికారులు జోక్యం చేసుకుని, చర్చల సారాంశాన్ని సంబంధిత మంత్రి, ముఖ్యమంత్రికి వివరించి, తుది నిర్ణయం తీసుకుందామని చెప్పగా భాగస్వామ్యులు సుముఖత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈదర యశ్వంత్‌కుమార్‌ రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో అప్సడా కో వైస్‌చైర్మన్‌ వెంకట రమణారెడ్డి, మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌, సిబా, ఎంపెడా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 04:57 AM