సమస్యల్లేని వీధి వ్యాపారం
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:25 AM
ప్రజా జీవితానికి ఆటంకాలు లేకుండా పట్టణాల్లో వీధి వ్యాపారాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వీధి వ్యాపారాలు ఏ జోన్లలో చేయవచ్చు, ఏ జోన్లలో..
51 పట్టణాల్లో స్ట్రీట్ వెండింగ్ జోన్లకు గ్రీన్ సిగ్నల్
వ్యాపారాలు అనుమతించే, నిషేధించే ప్రాంతాల గుర్తింపు
ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రజా జీవితానికి ఆటంకాలు లేకుండా పట్టణాల్లో వీధి వ్యాపారాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వీధి వ్యాపారాలు ఏ జోన్లలో చేయవచ్చు, ఏ జోన్లలో చేయకూడదు అనేది ఆ ప్రణాళికల్లో స్పష్టంగా పేర్కొంది. దీనిని సంబంధించి రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక స్ట్రీట్ వెండింగ్ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీధి వ్యాపారుల జీవనోపాధిని కాపాడటం, ప్రజా సౌకర్యాల మధ్య సమతుల్యత తీసుకురావడం లక్ష్యంగా మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ, వీధి వ్యాపారాల నియంత్రణ) చట్టం-2014 లోని సెక్షన్ 21(2) ప్రకారం ఈ వెండింగ్ ప్లాన్లకు చట్టబద్ధ గుర్తింపు కల్పించింది. ప్రతి పట్టణంలో వీధి వ్యాపారం అనుమతించే ప్రాంతాలు, పూర్తిగా నిషేధిత ప్రాంతాలు, నియంత్రిత వ్యాపార ప్రాంతాలను స్పష్టంగా గుర్తించారు. దీంతో రోడ్లు, ఫుట్‌పాత్‌లు, కూడళ్లు, ప్రజా ప్రదేశాల్లో అస్తవ్యస్త పరిస్థితులు తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు భీమవరం, హిందూపురం, గుంతకల్, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, నరసాపురం, నిడదవోలు, మండపేట, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, నూజివీడు, వినుకొండ, పార్వతీపురం, పలాస-కాశీబుగ్గ, బొబ్బిలి, సాలూరు, ఆముదాలవలస, బద్వేలు, రాజంపేట, కదిరి, జంగారెడ్డిగూడెం, కనిగిరి, గిద్దలూరు, గూడూరు తదితర పట్టణాలున్నాయి. మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా వెండింగ్ ప్లాన్ల తయారీ జరుగుతోందని, త్వరలో వాటిని నోటిఫై చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు, పట్టణ స్థానికసంస్థలతో జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ నోటిఫికేషన్ జారీచేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ, డీటీసీపీ డైరెక్టర్, సంబంధిత అన్నీ పట్టణ స్థానికసంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
వ్యాపారులకు కచ్చితమైన నిబంధనలు
నోటిఫికేషన్ ప్రకారం వీధి వ్యాపారులు శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. తాత్కాలికంగా తొలగించగల స్టాళ్ల ద్వారానే వ్యాపారం చేయాలి. రహదారులు, పాదచారుల మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. మురుగు కాల్వల్లో చెత్త వేయడం, ప్రజా ప్రదేశాలను అపరిశుభ్రం చేయడం నిషేధం. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే స్థానికసంస్థల సూచన మేరకు స్థలం మారాల్సి ఉంటుంది.
స్థానికసంస్థల బాధ్యతలు ఇవీ...
ప్రతి ఐదేళ్లకోసారి టౌన్‌వెండింగ్ కమిటీల సిఫార్సులతో వెండింగ్ ప్లాన్లను పట్టణ స్థానిక సంస్థలు రూపొందించాలి. అర్హులైన వ్యాపారులకు మాత్రమే గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. సాధ్యమైన మేరకు తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, చెత్త నిర్వహణ వంటి సౌకర్యాలు కల్పించాలి. ఈ వెండింగ్ ప్లాన్లను మాస్టర్ ప్లాన్లు, జోనల్ డెవల్‌పమెంట్ ప్లాన్లలో కూడా చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది.