Share News

మందు సీసాల సైజు మార్పు!

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:42 AM

కొత్త పరిమాణంలో మద్యం సీసాలు రానున్నాయి. చాలాకాలంగా వీటి పరిమాణం 180, 375, 750 మిల్లీ లీటర్లలోనే ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా లీటరు, 90ఎంఎల్‌ సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి.

మందు సీసాల సైజు మార్పు!

  • కొత్తగా 150, 200 ఎంఎల్‌ బాటిళ్లు

  • రూల్స్‌ సవరిస్తూ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు

  • కేసులో ఎన్నేసి సీసాలో కూడా ఖరారు

  • ‘బ్రాండ్‌’ పేరుతో బోర్డులు పెట్టొద్దు

  • మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశం

అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కొత్త పరిమాణంలో మద్యం సీసాలు రానున్నాయి. చాలాకాలంగా వీటి పరిమాణం 180, 375, 750 మిల్లీ లీటర్లలోనే ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా లీటరు, 90ఎంఎల్‌ సైజుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 150, 200 ఎంఎల్‌ పరిమాణంతో సీసాలు తయారుచేస్తామని, అనుమతివ్వాలని ఇటీవల కొన్ని మద్యం కంపెనీలు కోరాయి. అందుకు అనుగుణంగా చౌకమద్యం (ఐఎంఎఫ్ఎల్‌) రూల్స్‌ను సవరిస్తూ ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మద్యం కేసు అంటే ఏ పరిమాణంలో ఎన్ని సీసాలు ఉంటాయో కూడా అందులో పేర్కొన్నారు. ఒక కేసుకు క్వార్టర్‌ సీసాలైతే 48, హాఫ్‌ బాటిళ్లు 24, ఫుల్‌ బాటిళ్లు 12 ఉంటాయి. కొత్తగా రాబోయే 150 ఎంఎల్‌ సీసాలైతే 60, 200 ఎంఎల్‌ సీసాలు 45 ఒక కేసులో ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ధరలే కొత్త పరిమాణంలోని సీసాలకూ వర్తిస్తాయి. అయితే దీనివల్ల అమ్మకాల్లో మార్పులొచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎక్కువ మంది క్వార్టర్‌ సీసాలే కొంటుంటారు. అంతకంటే తక్కువ లిక్కర్‌ చాలని భావిస్తే అందులో సగం 90ఎంఎల్‌ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 150, 200 ఎంఎల్‌ సీసాలు వస్తే కొంత ధర తగ్గుతుంది కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఆ బోర్డులు తొలగించండి

మద్యం షాపులు, బార్లకు మద్యం బ్రాండ్ల పేర్లతో ఉండే బోర్డులు, హోర్డింగులు తొలగించాలని ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. వెంటనే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులకు స్పష్టంచేశారు. ఇటీవల జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అందుకు అనుగుణంగా ఎక్సైజ్‌ కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ఆదేశాలకు సహకరించాలని షాపులు, బార్ల లైసెన్సీలను కోరారు. చాలా వరకు మద్యం దుకాణాల వద్ద ఏదో ఒక బ్రాండ్‌ పేరుతోనే బోర్డులు ఉన్నాయి. వారి బ్రాండ్లను ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఆయా బ్రాండ్ల పేరు, లైసెన్సీ పేరుతో కలిపి బోర్డులు పెడుతున్నారు. నిబంధనల ప్రకారం మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదు. అయితే కంపెనీలన్నీ ప్రచారం కోసం అదే బ్రాండ్‌ పేరుతో మంచినీళ్లు, సోడాలు అమ్మేలా రిజిస్ర్టేషన్‌ చేసుకుంటాయి. షాపుల వద్ద పెట్టే బోర్డులో ఆ బ్రాండ్‌ పేరు పెద్దగా చూపించి.. చిన్నగా మంచినీళ్లు, షోడా అని ముద్రిస్తారు. ఇది సాంకేతికంగా నిబంధనల ఉల్లంఘన కాదు. అందుకే షాపుల వద్ద ఆయా కంపెనీలు వారి బ్రాండ్‌ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి.

Updated Date - Jun 03 , 2026 | 04:42 AM