పరిశ్రమలకు భూ కేటాయింపులు
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:58 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పలు పారిశ్రామిక సంస్థలకు రాయితీలతో కూడిన భూముల అప్పగింతతో పాటు పెట్టుబడి రాయితీలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది.
ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పన
పతంజలి సంస్థకు విజయనగరంలో 70 ఎకరాలు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పలు పారిశ్రామిక సంస్థలకు రాయితీలతో కూడిన భూముల అప్పగింతతో పాటు పెట్టుబడి రాయితీలు కల్పించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలు, వాణిజ్య విభాగం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడులో జీరో 21 రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు చక్రాల ఆటో, రెట్రో ఫిట్‌మెంట్ కిట్ల తయారీ యూనిట్‌ను రూ.525 కోట్లతో స్థాపించనుంది. 625 మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపింది. ఈ సంస్థకు 48.14 ఎకరాలను ఎకరా రూ.30 లక్షల చొప్పున అప్పగించడంతో పాటు 40 మెగావాట్ల (50,000 కేవీఏ) నిరంతరాయ విద్యుత్తు, 10 లక్షల లీటర్ల నీటి సరఫరా, 80 అడుగుల అప్రోచ్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సదుపాయాలన్నీ 6 నెలల్లో కల్పించాలని ఏపీఐఐసీని ఆదేశించింది.
చిత్తూరు జిల్లా శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో రూ.1,123.49 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగాలు కల్పించే అవెరాన్ ప్యానెల్స్ లిమిటెడ్‌కు మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డులు తయారు చేసేందుకు 106 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కోసం 132/66 కేవీఏ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఇంధన శాఖను ఆదేశించింది. హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స కాలువ నుంచి నీటిని సరఫరా చేయాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
జీడీ నెల్లూరు ఇండిస్ట్రియల్ పార్కులో ప్లాట్ నం. 19, 20, 21లలోని 1.57 ఎకరాలను విక్రయించేందుకు, లీజులకు ఇచ్చేందుకు పుత్తా శ్రీ లెదర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు స్వేచ్ఛను ఇస్తూ నిరభ్యంతర పత్రాన్ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ సంస్థలో రూ.12.96 కోట్ల పెట్టుబడివల్ల 49 మందికి ఉద్యోగాలు దక్కుతాయి.
తిరుపతిలో స్థాపించిన మున్నోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు ప్రస్తుతం కేటాయించిన 7.19 ఎకరాలకు అదనంగా 15.28 ఎకరాలను కేటాయిం చనుంది. లూథియం బ్యాటరీలను తయారీకి రూ.730 కోట్లతో పరిశ్రమ స్థాపించింది.
మీడియం, లార్జ్ క్యాలిబర్ అమ్యూనిషన్, వార్‌హెడ్స్ అండ్ ఫ్యూజెస్ వంటి రక్షణ పరికరాలు తయారు చేసే అనడ్రోన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం పాపంపల్లెలో 349.95 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
రక్షణ శాఖ కోసం మిసైల్ అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, లోయిటరింగ్ మ్యూనిషన్ తయారీ యూనిట్ స్థాపనకు అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నెల్లూరు జిల్లా దుత్తలూరులో 300 ఎకరాలు కేటాయించింది.
అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో సాలిడ్ ప్రొపల్లెంట్(రాకెట్ ఇంధనం) ప్రాసెసింగ్ ఫెసిలిటీని స్థాపించేందుకు స్పేస్‌ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 120.76 ఎకరాలను కేటాయించింది.
ఎన్‌టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలం, జయంతిపురంలో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఐకామ్ టెలీ లిమిటెడ్‌కు 300 ఎకరాలు కేటాయించింది.
తిరుపలి జిల్లా నాయుడుపేటలో అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్ ప్రాజెక్టును స్థాపించేందుకు ప్రతిపాదనలు ఇచ్చిన ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెమ్‌కు రోడ్లు, విద్యుత్తు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్థ 750 సింగిల్, 250 డబుల్ బెడ్ రూమ్‌లతో పాటు 1,400 బెడ్‌లతో కూడిన 150 గదులు నిర్మిస్తుంది. వీటిలో 5,750 మంది నివాసానికి అనువుగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నరావుపల్లెలో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు 70 ఎకరాలను ఫుడ్ అండ్ హెర్బల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించింది.
అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు సర్ల ఏవియేషన్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.