ఆరోగ్య రథాల్లో 41 పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - May 19 , 2026 | 04:43 AM
ఆరోగ్య రథాల (104 వాహనాలు)లో 41 రకాల వైద్య పరీక్షలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏడాదికి 56.40 లక్షల మందికి పరీక్షలు
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య రథాల (104 వాహనాలు)లో 41 రకాల వైద్య పరీక్షలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ‘సిటిజన్ హెల్త్ స్ర్కీనింగ్’ పేరుతో నిర్వహించే ఈ పరీక్షలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 904 ఆరోగ్య రథాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తున్నాయి. ఒక్కో వాహనంలో రోజుకు సుమారు 20 మంది రోగులకు ఈ 41 రకాల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 904 ఆరోగ్యరథాల ద్వారా ఏడాదికి 56,40,096 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో ఆరోగ్యరథం నెలకు 520 మందికి 41 రకాల పరీక్షలు చేసినందుకు నిర్వహణ సంస్థకు ప్రభుత్వం నెలకు రూ.1.5 లక్షలు అదనంగా చెల్లించనుంది. ఆరోగ్యరథాలను నిర్వహించే సంస్థనే వైద్య పరీక్షలకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.