Share News

29,021 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:38 AM

రాష్ట్రంలో రూ.29,021 కోట్ల పెట్టుబడులతో 22,407 మందికి ఉద్యోగాలు కల్పించేలా పలు ప్రాజెక్టులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.

29,021 కోట్ల పెట్టుబడులు

  • 22,407 ఉద్యోగాలు

  • విద్యుత్తు రంగంలో 11,943 కోట్లతో 9,690 ఉద్యోగాల కల్పన

  • ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.29,021 కోట్ల పెట్టుబడులతో 22,407 మందికి ఉద్యోగాలు కల్పించేలా పలు ప్రాజెక్టులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. బుధవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్తు రంగంలో రూ.11,943 కోట్ల పెట్టుబడులతో 9,690 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. యశశ్వ పవర్‌ ప్రాజెక్టు రూ.1200 కోట్లతో 690 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా 200 మెగావాట్ల ఏసీ/300 మెగావాట్ల డీసీ పవర్‌ పార్కును ఏర్పాటు చేయనుంది. క్రోమా అలార్‌ ఇంటర్నేషనల్‌ ఎఫ్‌ జెడ్‌ రూ.2000 కోట్లతో 5,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా రోజుకు 200 టన్నుల కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రీడ్‌ ట్వల్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1391 కోట్లతో 200 మందికి ఉద్యోగాలు కల్పించేలా 160 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. రెన్యూ ఫొటోవోల్లాలిక్స్‌ రూ.1461 కోట్లతో 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా 125 మెగావాట్ల విండ్‌ సోలార్‌ హైబ్రీడ్‌ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ అంగీకరించింది. ఎన్‌టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ రూ.4,500 కోట్ల పెట్టుబడితో 3,100 మందికి ఉద్యోగాలు కల్పించే 900 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సమావేశంలో మంత్రులు లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, టీజీ భరత్‌, పి.నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇతర ప్రాజెక్టులకు ఆమోదాలు

  • అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ సంస్థ రూ.2,387.81 కోట్లతో 1000 మందికి ఉద్యోగాలు కల్పించే ప్లాంటును అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనుంది.

  • కంపాస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.101.28 కోట్లతో 150 మందికి ఉద్యోగాల కల్పన. 2024-29 ప్రోత్సాహక విధానాన్ని అమలు చేయాలని ఎస్‌ఐపీబీ నిర్ణయించింది.

  • అకాడ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.330 కోట్ల పెట్టుబడితో 372 మందికి ఉద్యోగాలను కల్పించనుంది. ఈ సంస్థకు ప్రభుత్వ విధానాల మేరకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది.

  • వీరాంజనేయ హాస్పిటాలిటీ రూ.89.32 కోట్లతో 150 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.

  • అక్షయ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ రూ.54.02 కోట్లతో 80 మందికి ఉద్యోగాల కల్పన.

  • ఎకో-ఐఎ్‌సఎల్‌ఈ రిసార్ట్స్‌ రూ.262.87 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులో 500 మందికి ఉద్యోగ కల్పనకు ఆమోదం.

  • మెసర్స్‌ సైబర్‌సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1226 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులో 1500 మందికి ఉద్యోగాల కల్పన.

  • కేపీసీ ప్రాజెక్టు రూ.280.51 కోట్ల పెట్టుబడితో 310 మందికి ఉద్యోగాలు ఇచ్చే టూరిజం ప్రాజెక్టు ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌.

  • రుషికొండ బీచ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.424.20 కోట్లతో 450 మందికి ఉద్యోగాలు కల్పన.

  • ఎస్వీఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ రూ.104 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పన.

  • రాధికా వెజిటబుల్‌ ఆయిల్స్‌ రూ.240 కోట్లతో 304 మందికి ఉద్యోగాల కల్పన.

  • హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ రూ.209.58 కోట్లతో 35 మందికి ఉపాధిని కల్పించేలా పాల ఉత్పత్తుల తయారీకి ఆమోదం.

  • ఏస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.786.15 కోట్లతో 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.

  • స్నేహా ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతిపాదనలకు ఆమోదం.

  • రామాయపట్నం కార్గో రిసెప్షన్‌ టెర్మినల్స్‌ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌.

  • వారీ ఎనర్జీ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.8,175 కోట్లతో 3000 మందికి ఉపాధి కల్పన.

  • సగాచి ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.314.66 కోట్లతో 780 మందికి ఉద్యోగాల కల్పన ప్రతిపాదనలకు ఆమోదం.

Updated Date - Feb 19 , 2026 | 03:40 AM