Share News

నిరుద్యోగులకు ఉగాది కానుక

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:33 AM

నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక అందించనుంది. 60 విభాగాల్లో 10 వేల పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ను కొత్త సంవత్సరాది రోజు ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉగాది కానుక

  • 470 గ్రూప్‌-2, 101గ్రూప్‌-1 పోస్టులు

  • 10 వేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌!

  • కొత్త సంవత్సరాది రోజు విడుదల

  • 3 వేలకు పైగా టీచర్‌ పోస్టులతో డీఎస్సీ

  • యూనివర్సిటీల్లో 1,500 పోస్టులు

  • ఆర్థిక శాఖ పరిశీలనలో ఇతర పోస్టులు

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక అందించనుంది. 60 విభాగాల్లో 10 వేల పోస్టుల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ను కొత్త సంవత్సరాది రోజు ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆయా శాఖల్లో ఖాళీల భర్తీపై అధికారులతో శుక్రవారం ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించగా, మరికొన్ని ఆ శాఖ పరిశీలనలో ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం ఎన్ని పోస్టులు జాబ్‌ క్యాలెండర్‌లో ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ఇప్పటివరకూ ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్‌-2 పోస్టులు, 101 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. గతేడాది మెగా డీఎస్సీ నిర్వహించి 16వేల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ ఏడాది మరో మూడు వేలకుపైగా పోస్టుల భర్తీని జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించనుంది. యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల్లో తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు న్యాయ వివాదాలతో చాలాకాలం నుంచి ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో భర్తీకి హడావిడిగా ప్రక్రియ ప్రారంభించినా, రోస్టర్‌ తప్పులతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు పరిష్కరించి తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇకనుంచి ఏటా డీఎస్సీ వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ పోస్టులను కూడా జాబ్‌ క్యాలెండర్‌లోకి తీసుకొస్తోంది.


సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ, ఇతర శాఖల్లో గ్రూప్‌-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా, గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. 87 గ్రూప్‌-1, 891 గ్రూప్‌-2 పోస్టులను భర్తీ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వార్డ్‌ కింద జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటిస్తుంది. అలాగే వివిధ శాఖల్లో భర్తీ చేపట్టదలచిన పోస్టులను క్యాలెండర్‌లో చూపించనుంది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా వెయ్యి పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రూప్‌-1లో...

జాబ్‌ క్యాలెండర్‌లో డిప్యూటీ కలెక్టర్లు 11, డీఎస్పీ సివిల్‌ 10, డీఎస్పీ జైళ్లు 4, ఆర్టీవో 3, డీఎల్‌వో 35, కో-ఆపరేటివ్‌ రిజిస్ర్టార్‌ 17, ఏఏవో 3, సీటీవో 10, డీఈవో 2, డీఎ్‌సడబ్ల్యూవో 4, డీటీడబ్ల్యూవో 2 పోస్టులు ఉన్నాయి. మరికొన్ని విభాగాల్లోనూ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 04:34 AM