అతిపెద్ద ‘ప్రకృతి వ్యవసాయ’ క్షేత్రంగా ఏపీ
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:59 AM
రాష్ట్రాన్ని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం.. త్వరలో రాష్ట్రమంతా శిక్షణ తరగతులు
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ.. లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు
ఇకపై పంటలవారీగా ఫెస్టివల్స్.. వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18 లక్షల మంది రైతులు 20లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసేందుకు ముందుకొచ్చారని, దీనిని సమర్ధవంతంగా అమలుచేస్తూ.. 2030-31 నాటికి 40లక్షల మంది రైతులు.. 50లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘ప్రకృతి సాగుతో వచ్చే ఫలితాలను వ్యవసాయ విద్యార్థులు స్వయంగా తెలుసుకునేలా చేయాలి. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలి. సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ వంటివి ఏప్రిల్‌కల్లా వచ్చేలా చూడాలి. జూన్ నాటికి రాష్ట్రమంతా పూర్తి కావాలి. సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించాలి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలి. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించాలి.
రాయలసీమలో ఒకప్పుడు నీటి సమస్య ఉండేది. సమర్ధ నీటి నిర్వహణతో ఈ ఏడాది ఆ సమస్యను తీర్చాం. అన్ని రిజర్వాయర్ల నింపడంతో పాటు సాగునీటికి లోటు లేకుండా చేశాం’ అని చెప్పారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కల్టివేషన్, ప్రొసెసింగ్, మార్కెటింగ్.. ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలని స్పష్టంచేశారు. గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో కుంకుమపువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు. పౌల్ర్టీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా కాంట్రాక్టు రైతులకే ఇవ్వాలని నిర్ధేశించారు.
విజయవాడలో ఫ్లవర్ మార్కెట్
విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి సీఎం అంగీకారం తెలిపారు. కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించినట్టే.. మన పంటలకు సంబంధించి, వివిధ ప్రాంతాల్లో ఫెస్టివల్స్ నిర్వహణకు ఆలోచన చేయాలని, దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్ ఖర్చు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విస్తృతం అవుతుందన్నారు. ఫ్రూట్ కవర్లతో మామిడికి మంచి నాణ్యత, ధర వచ్చిందని, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలని సూచించారు. మార్కెట్ యార్డులున్నచోటే రైతుబజార్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైనచోట రైతుబజార్లను ఆధునీకరించాలని సీఎం సూచించారు. డిజి రైతుబజార్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కూరగాయలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఫార్మ్ మిషనరీ కోసం ఏపీఏఐఎంఎస్ యాప్‌ను, కిసాన్ డ్రోన్ ప్రారంభించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, డ్రోన్లు, గడ్డికోత మిషన్లు, పవర్ టిల్లర్లు బుక్ చేసుకుని, సేవలను పొందవచ్చు. రాష్ట్రంలో 9,512 యంత్ర పరికరాలు సిద్ధంగా ఉంచారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.