చెరువులపై ఇంత నిర్లక్ష్యమా?
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:34 AM
రాష్ట్రంలో కరువును దూరం చూసే చెరువుల మరమ్మతు, నిర్వహణకు ప్రాధాన్యం లభించడం లేదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాటి మరమ్మతులకు 372 కోట్లు అవసరం
బడ్జెట్‌లో కేటాయింపులు 72 కోట్లే
పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా చెక్‌డ్యాముల నిర్మాణం
గొలుసుకట్టు చెరువులకూ ప్రాధాన్యం
ఇక్కడ మాత్రం అరకొర నిధులు
అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువును దూరం చూసే చెరువుల మరమ్మతు, నిర్వహణకు ప్రాధాన్యం లభించడం లేదని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు మహారాష్ట్రల్లో చిన్నతరహా సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తుంటే.. ఇక్కడ మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని అంటున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకం కింద చెరువుల పూడికతీత, నీటి కుంటల తవ్వకం, ఇంకుడు గంతల తవ్వకం పనులు చేపట్టారు. వీటికి నిధులివ్వకుండా జగన్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. హైకోర్టు ఆదేశాలిచ్చినా చెల్లింపులు జరుపలేదు. పైగా 356 మంది జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ విభాగంలో పనులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. చెరువులు, నీటి కుంటలు, వాటర్‌షెడ్ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అదే నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతోందని నిపుణులు విమర్శిస్తున్నారు. జలవనరుల వాఖలో 100 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువులు 3,486.. పంచాయతీరాజ్ శాఖలో 100 ఎకరాలు ఆయకట్టు ఉన్న చెరువుల సంఖ్య 35,376 ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే చెరువులు 38,862 ఉన్నాయి. వీటన్నిటికీ మరమ్మతులు చేయాల్సిన అవసరముంది. ఇందుకు రూ.372 కోట్లు అవసరం కాగా.. తాజా బడ్జెట్‌లో 72 కోట్లు మాత్రమే కేటాయించడంపై నిపుణులు ఆక్షేపిస్తున్నారు. కాలువల పూడికతీత, చెరువుల పూడికతీత, చెక్‌డ్యాముల వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కేంద్రం పీఎం కిసాన్ యోజన కింద చెరువుల అభివృద్ధికి నిధులు ఇస్తోంది. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది రూ.299 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నీటి వినియోగదారుల సంఘాల ద్వారా రూ.10 లక్షల దారా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినందున.. చెరువులు, చెక్‌డ్యాములకు వీటిని వాడుకోవాలని కోరుతున్నారు.