Share News

మనకూ ఎయిర్‌ ట్యాక్సీలు వస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:46 AM

రోడ్లపై ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలకు త్వరలోనే ఎయిర్‌ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌పెట్టేలా మానవ రహిత ఎలక్ర్టిక్‌ ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు..

మనకూ ఎయిర్‌ ట్యాక్సీలు వస్తున్నాయ్‌!

  • మానవ రహిత ఎయిర్‌ ట్యాక్సీలు సిద్ధం

  • గుంటూరులో భవిష్యత్‌ రవాణాకు శ్రీకారం

  • ‘వీ2-2.0’ ఎయిర్‌ ట్యాక్సీతో ట్రాఫిక్‌కు చెక్‌

  • డ్రైవర్‌ లేకుండా గాల్లో ప్రయాణం.. మాగ్నమ్‌వింగ్స్‌ సంచలనం

(గుంటూరు సిటీ - ఆంధ్రజ్యోతి)

రోడ్లపై ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలకు త్వరలోనే ఎయిర్‌ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌పెట్టేలా మానవ రహిత ఎలక్ర్టిక్‌ ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గుంటూరుకు చెందిన మాగ్నమ్‌వింగ్స్‌ సంస్థ సన్నాహాలు పూర్తి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ‘వీ2 2.0 ఎలక్ర్టిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ’ నమూనాలను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ‘‘అర్బన్‌ ఎయిర్‌ మొబిలిటీ’’లో భాగంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఎయిర్‌ ట్యాక్సీలకు పైలట్‌ లేదా డ్రైవర్‌ అవసరం లేదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సెన్సర్‌ టెక్నాలజీ, జీపీఎస్‌ నావిగేషన్‌, ఆటో ఫ్లైట్‌ కంట్రోల్‌ వ్యవస్థలతో ఇవి పనిచేస్తాయని సంస్థ వెల్లడించింది. ప్రయాణికుడు గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుంటే చాలు... మిగతా మొత్తం ప్రయాణాన్ని సిస్టమ్‌ స్వయంగా నిర్వహిస్తుందని తెలిపింది. నగరాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు ఇది పరిష్కారంగా మారవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రోడ్లపై గంటల తరబడి సాగే ప్రయాణాన్ని గాల్లో కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని సంస్థ తెలిపింది. ముఖ్యంగా అత్యవసర సేవలు, కార్పొరేట్‌ ప్రయాణాలు, మెడికల్‌ ఎమర్జెన్సీల్లో ఇవి కీలకం కానున్నాయి. ఎయిర్‌ ట్యాక్సీల భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంస్థ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమ్యాటిక్‌ బ్యాకప్‌ సిస్టమ్‌, అత్యవసర సేఫ్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీ, మల్టిపుల్‌ బ్యాటరీ సపోర్ట్‌ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వాతావరణ పరిస్థితులను ముందుగానే గుర్తించే స్మార్ట్‌ సెన్సర్లు కూడా వీటిలో ఉంటాయని పేర్కొంది.

Untitled-2 copy.jpg


గుంటూరులోనే తయారీ కేంద్రం?

ఈ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే గుంటూరులోనే ప్రత్యేక ఎయిర్‌ మొబిలిటీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం. ఇందుకోసం అంతర్జాతీయ సాంకేతిక సంస్థలతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఎలక్ర్టిక్‌ ఎయిర్‌ ట్యాక్సీల అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌, ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రంగం ద్వారా ఇంజినీరింగ్‌, ఏరోనాటిక్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డ్రోన్‌ టెక్నాలజీ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో డెమో ఫ్లైట్లు నిర్వహించనున్నట్లు సమాచారం.

మాతృ భూమిపై మమకారంతో..

మాగ్నమ్‌వింగ్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిరామ్‌ చావా అమెరికాలో మాస్టర్స్‌ రోబోటిక్స్‌ పూర్తి చేశారు. మాతృ భూమిపై మమకారంతో స్వదేశానికి తిరిగొచ్చి గుంటూరులో మాగ్నమ్‌వింగ్స్‌ సంస్థను స్థాపించారు. నాలుగైదేళ్ల నుంచి ఎయిర్‌ ట్యాక్సీల తయారీలో నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. అభిరామ్‌ చావాను పిలిపించి అభినందించారు. ‘‘మా ప్రయత్నం పూర్తిగా విజయవంతమైంది. సర్టిఫికేషన్‌, రెగ్యులేటరీ అనుమతి, సేఫ్టీ క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత మానవ ప్రయాణ పరీక్షలు నిర్వహిస్తాం. అన్ని అనుమతులు పూర్తయితే ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్‌ ట్యాక్సీ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం’’ అని మాగ్నమ్‌వింగ్స్‌ ఎండీ అభిరామ్‌ చావా తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 04:49 AM