Share News

ఏఐ కేరాఫ్ ఏపీ

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:35 AM

రాబోయే కాలంలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గమ్యస్థానం ఏపీయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సిలికాన్‌ వ్యాలీ తరహాలో భవిష్యత్తులో ప్రజలు క్వాంటమ్‌ వ్యాలీ గురించి, దానికి కేంద్రంగా మారుతున్న అమరావతిని గురించి మాట్లాడుకుంటారన్నారు.

ఏఐ కేరాఫ్ ఏపీ

  • అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

  • ఈ ఏడాది చివరకల్లా తొలి ‘కంప్యూటరు’

  • అమరావతిలో గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌

  • డేటా సెంటర్లు ముఖ్యం.. డేటానే సంపద

  • దేశాభివృద్ధికి చర్చలు, ఏకాభిప్రాయమే కీలకం

  • దేశంలోనే తొలిసారి పాపులేషన్‌ పాలసీ తెచ్చాం

  • ‘రైసినా డైలాగ్‌’లో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన

‘‘సహనం, చర్చలు, సహకారమే దేశాభివృద్థికి మార్గదర్శకాలు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే గొప్ప వారసత్వం భారత్‌కు ఉంది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్ల భారత్‌ బలమైన ఆర్థిక వృద్థి రేటును కొనసాగించగలుగుతోంది.’’

- సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): రాబోయే కాలంలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ గమ్యస్థానం ఏపీయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సిలికాన్‌ వ్యాలీ తరహాలో భవిష్యత్తులో ప్రజలు క్వాంటమ్‌ వ్యాలీ గురించి, దానికి కేంద్రంగా మారుతున్న అమరావతిని గురించి మాట్లాడుకుంటారన్నారు. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని తెలిపారు. గతంలో భారత్‌ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్‌ మైగ్రేషన్‌ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. విదేశీ వ్యవహారాల శాఖ-అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ‘రైసినా డైలాగ్‌ -2026’ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్వహకులు ఆహ్వానించడం ఇదే తొలిసారి. ‘సాంకేతికత-సుపరిపాలన-భవిష్యత్తు’ అనే అంశంపై సీఎం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అభివృద్థి చెందుతోందని, భవిష్యత్తులో దీనివల్ల అనేక మార్పులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే అమరావతిలో ప్రారంభమైందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Untitled-2 copy.jpg


ఇప్పటికే ఒక క్వాంటమ్‌ కంప్యూటర్‌ను స్థాపించినట్లు, ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తాము క్వాంటమ్‌ కంప్యూటర్లను తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేయబోతున్నట్లు చెప్పారు. అమరావతిలో ‘గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌’ను ప్రారంభిస్తున్నామని సీఎం చెప్పారు. భార త పరిశ్రమల సమాఖ్యతో కలసి ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఇప్పటికే భూమిని కేటాయించామని చెప్పారు. దావోస్‌ ఎలాగైతే ఒక ఎకనామిక్‌ ఫోరమ్‌ (ఆర్థిక వేదిక)గా ఉందో, అమరావతిని అలాగే ‘లీడర్‌షిప్‌ ఫోరమ్‌’గా మార్చబోతున్నామని చంద్రబాబు వివరించారు.

అభివృద్ధి, సాంకేతికతలో దూకుడు..

‘‘భారత్‌ శరవేగంగా అభివృద్థి, సాంకేతికత వైపు దూసుకుపోతోంది. నాలెడ్జ్‌ ఎకానమీలో మనం ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లలో సుమారు 57-60 శాతం భారత్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌ ఇప్పుడు నాలెడ్జ్‌ ఎకానమీగా ఎదగడం మనకు గర్వకారణం. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని నిర్మిస్తున్నా. ఇది అత్యంత అందమైన నగరాలలో ఒకటిగా ఉండనుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ దీని గురించి మాట్లాడుకుంటారు. హైదరాబాద్‌ ‘బ్రౌన్‌ ఫీల్డ్‌’ నగరమైతే, అమరావతి ‘గ్రీన్‌ ఫీల్డ్‌’ నగరం. అన్ని సౌకర్యాలు భూగర్భంలో ఉండేలా డక్ట్స్‌ నిర్మిస్తున్నాం. ప్రతిదీ సాంకేతికతను ఉపయోగించి అత్యంత సమర్థవంతంగా చేస్తున్నాం. టెక్నాలజీని, ఇన్‌ఫ్రాను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం. ఎవరైనా ఎక్కు వ కాలం జీవించాలని అనుకుంటే అమరావతికి రావా లి. విభిన్నంగా ఆలోచించేవారి కోసం అమరావతిలో క్రియేటివ్‌ సిటీని, ఓ స్పేస్‌ సిటీని, డ్రోన్‌ సిటీని ఏర్పా టు చేస్తున్నాం.’’


సేవలో మనవాళ్లు అత్యుత్తమ దౌత్యవేత్తలు

‘‘భారతీయులు ఎక్కడ నివసించినా, ఎక్కడ పనిచేసినా స్థానిక సమాజంతో సులభంగా కలిసిపోతారు. అందువల్లే వారు ప్రపంచంలోనే అత్యుత్తమ దౌత్యవేత్తలు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలసలు కేవలం అమెరికా లేదా కొన్ని దేశాలకే పరిమితమయ్యేవి. కానీ నేడు తెలుగువారు, భారతీయులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. భారతీయులు తమ అనుకూలత, ేస్నహపూర్వక స్వభావం, ప్రపంచ సంక్షేమం పట్ల నిబద్ధతతో మంచి పేరు తెచ్చుకున్నారు. భారతీయ సాంకేతిక నిపుణులు ప్రపంచాభివృద్థిలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.’’ అని సీఎం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల సాంకేతికతలలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో మనం మెరుగైన సేవలు అందించడమే కాకుండా, బలమైన ఆర్థిక వ్యవస్థను కూడా సృష్టించగలమని వెల్లడించారు.


త్వరలోనే విద్యుత్‌ ఎగుమతి..

‘‘ఐటీ నుంచి ఏఐ వైపు మనం అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తును ఏఐ పూర్తిగా మార్చేయబోతోంది. రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో ఏఐ కీలకం కానుంది. ఇప్పుడు డేటా సెంటర్లు ముఖ్యం. డేటానే సంపద. ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటర్ల ద్వారా ఈ డేటాను ఎలా వినియోగించుకుంటామనేది ఆ దేశం, వ్యక్తి లేదా రాష్ట్ర ప్రభుత్వాల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఏపీలో గూగుల్‌ సంస్థ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ను, ఏఐ రంగాన్ని ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత ఇటీవలి కాలంలో ఇదే అతి పెద్ద పెట్టుబడి. త్వరలో డేటా సెంటర్ల కోసం గ్రీన్‌ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాం. భారత్‌లో ప్రస్తుతం సింగిల్‌ గ్రిడ్‌ ద్వారా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జరుగుతోంది. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌తోపాటు ఇతర సంప్రదాయ విద్యుత్‌ కారిడార్లు ఉంటాయి. గ్రీన్‌ అమ్మోనియా కూడా ఉత్పత్తి చేస్తున్నాం.’’

తగ్గుతున్న జనన రేటు..

‘‘కొన్ని దేశాలు ఇప్పటికే వృద్థాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్‌కు 2047 వరకు యువశక్తి ప్రయోజనం ఉంది. దేశ రీప్లే్‌సమెంట్‌ ఫెర్టిలిటీ రేటు 2.1 ఉండాలి. ప్రస్తుతం అది 2.2గా ఉంది. కానీ దక్షిణ భారతదేశంలో ఇది 1.5 మాత్రమే. దీనిని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏపీ పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీని ప్రవేశపెట్టాం. ఒక కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ సంతానం కలిగితే, రాష్ట్ర ప్ర భు త్వం రూ.25 వేల నగదు, ముగ్గురు సంతానం క లిగితే, ఐదేళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున అందిస్తాం. మహిళలకు ఏడాది పాటు ప్రసూతి సెలవులు, బిడ్డను చూసుకోవడానికి పురుషులకూ నెల, రెండు నెలలు సెలవు ఇస్తాం.


రాష్ట్రపతిని అవమానించడం బాధాకరం: చంద్రబాబు

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయి. వాటి పవిత్రతను కాపాడుకోవడం సమష్టి విధి’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన శనివారం స్పందించారు. ‘జరిగిన ఘటన దురదృష్టకరం. రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్‌ ప్రభుత్వం వ్యవహరించడం బాధ కలిగించింది. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అసాధారణ ప్రతిభ చాటారు!

గ్రేహౌండ్స్‌, ఆక్టోప్‌సకు సీఎం ప్రశంస

అమరావతి, మార్చి 7(ఆంధ్రజ్యోతి): హరియాణాలో జరిగిన 16వ అఖిల భారత పోలీసు కమాండో పోటీల్లో ఏపీ గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ కమాండోలు అసాధారణ ప్రతిభ చాటారని సీఎం చంద్రబాబు అభినందించారు. పలు ట్రోఫీలు సాధించి రాష్ట్రం గర్వపడేలా చేశారని సీఎం పేర్కొన్నారు. లోకేశ్‌ కూడా అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 08 , 2026 | 05:58 AM