Share News

ఆయిల్‌పామ్‌ సాగులో ఏపీ రికార్డు

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:36 AM

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచడంలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే 30వేల హెక్టార్ల మార్కును రాష్ట్రం దాటేసింది.

ఆయిల్‌పామ్‌ సాగులో ఏపీ రికార్డు

  • ఒక్క ఏడాదిలోనే 30వేల హెక్టార్లలో తోటల విస్తరణ

  • దేశంలోనే ప్రథమం: ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెంచడంలో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్క ఏడాదిలోనే 30వేల హెక్టార్ల మార్కును రాష్ట్రం దాటేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆయిల్‌పామ్‌ కొత్త తోటల విస్తరణలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఈ దశాబ్దంలోనే అత్యధికం. ఇంత మొత్తంలో ఉద్యాన తోటల విస్తరణ జరగడం దేశంలోనే ప్రప్రథమమని ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో గతేడాదికే 2.48లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగులో ఉండగా, 2025-26లో రాష్ట్రంలో 30,012 హెక్టార్ల కొత్త విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటలు విస్తరించడం విశేషం. దీంతో మొత్తంగా సాగు విస్తీర్ణం 2.78 లక్షల హెక్టార్లకు చేరగా, 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.204.13కోట్ల కేటాయింపుతో మరో 35వేల హెక్టార్లలో కొత్త తోటల విస్తరణకు ఉద్యాన శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయిల్‌పామ్‌కు ఉన్న అంతర్జాతీయ డిమాండ్‌ దృష్ట్యా కూటమి ప్రభుత్వం వచ్చాక.. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, ఉద్యాన శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు ఆయిల్‌పామ్‌ రైతుల్ని ప్రోత్సహించి, కొత్త తోటల విస్తరణకు కృషి చేశారు. దీంతో వరుసగా 2024-25, 2025-26లలో కూడా ఆయిల్‌పామ్‌ తోటల విస్తీర్ణం పెంచడంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. సాగు విధానాల్లో కూడా త్రిభుజ పద్ధతికి బదులు చదరపు పద్ధతిని ప్రోత్సహిస్తోంది. దీనివల్ల రైతులు పసుపు, అల్లం, మొక్కజొన్న, కూరగాయల వంటి వార్షిక పంటలతోపాటు, అరటి, కోకో, వక్క, జాజి, మిరియాలు వంటి శాశ్వత పంటలను ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతర పంటలుగా రైతులు సాగు చేస్తున్నారు. దీని వల్ల భూ వినియోగ సామర్ధ్యం పెరగడంతోపాటు రైతుల ఆదాయం మెరుగవుతోంది. పామాయిల్‌ రైతులకు మెట్రిక్‌ టన్నుకు సగటున రూ.19,579 ధర లభిస్తోంది.

Updated Date - Apr 01 , 2026 | 05:36 AM