అవయవదానంలో ఏపీకి ఐదో స్థానం
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:46 AM
అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అవయవ దానం కేసుల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది.
అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అవయవ దానంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అవయవ దానం కేసుల్లో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం విడుదల చేసిన అవయవదానం-2025 జబితాలో ఈ విషయం వెల్లడైంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అవయవదానంపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది రెండు నెలల కాలంలో 18 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 64 అవయవాలు సేకరించి 64 మంది జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. గత రెండేళ్లలో అవయవదానం గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాది మొదటి రెండు నెలల్లో 12 మంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి 31 అవయవాలు మార్పిడి చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,200 మందికి జీవన్‌దాన్ ద్వారా నూతన జీవితాలు ప్రసాదించామని చెప్పారు. ఇప్పటి వరకూ 5,347 మంది పలు అవయవాల కోసం జీవన్‌దాన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా... వారిలో అత్యధికులు యువకులే ఉన్నారన్నారు.