Share News

పంచాయతీల పురోగతిలో ఏపీ భేష్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:58 AM

దేశవ్యాప్తంగా పంచాయతీల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ బుధవారం విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచిక...

పంచాయతీల పురోగతిలో ఏపీ భేష్‌

  • 591 పంచాయతీలకు ఏ గ్రేడ్‌తో దేశంలోనే మూడో స్థానం

  • రాష్ట్రంలో అత్యుత్తమ పంచాయతీగా నాయనూరు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పంచాయతీల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ సత్తా చాటింది. కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ బుధవారం విడుదల చేసిన పంచాయతీ పురోగతి సూచిక (పీఏఐ)-2.0లో దేశంలోనే మూడో స్థానంలో ఏపీ నిలిచింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా 2023-24 నాటికి దేశంలోని గ్రామపంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్రం ఈ సూచీని విడుదల చేసింది. పేదరిక నిర్మూలన, పంచాయతీల్లో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, నీటిలభ్యత, పారిశుధ్యం, పచ్చదనం, మౌలిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళా అనుకూల విధానాలు అనే తొమ్మిది కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరును కేంద్రం మదింపు చేసింది. ఉత్తమ పనితీరును కనబర్చిన పంచాయతీలను... అచీవర్స్‌ (90-100 మార్కులు), ఫ్రంట్‌ రన్నర్‌ (75-90), పెర్ఫార్మర్‌ (60-75), యాస్పిరెంట్‌ (40-50), బిగినర్‌ (40 మార్కుల లోపు)గా విభజించారు. ఫ్రంట్‌ రన్నర్‌ కేటగిరిలో త్రిపురలో 943, తెలంగాణలో 624, ఆంధ్రప్రదేశ్‌లో 591 పంచాయతీలు ఏ గ్రేడ్‌ దక్కించుకుని తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

ఏపీలో నాయనూరు టాప్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,310 గ్రామ పంచాయతీల్లో చిత్తూరు జిల్లా కుప్పం బ్లాక్‌కు చెందిన నాయనూరు పంచాయతీ 84.67 స్కోరుతో ఏ గ్రేడ్‌ (ఫ్రంట్‌ రన్నర్‌) సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో వైఎస్ఆర్‌ జిల్లా, ఖాజీపేట బ్లాక్‌లోని చెముళ్లపల్లి 97.14 స్కోరుతో ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించింది. ఆరోగ్యంలో గుంటూరు జిల్లా పాండ్రపాడు 91.33 స్కోరుతో ఏ ప్లస్‌ గ్రేడ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. చిన్నారుల అనుకూల సౌకర్యాల కల్పనలో పల్నాడు జిల్లా కచవరం పంచాయతీ 96.67 స్కోరుతో అగ్రస్థానం సాధించింది. నీటి లభ్యతలో నెల్లూరు జిల్లా ఏపిలగుంట 95 స్కోరు సాధించింది. పారిశుధ్యం, పచ్చదనంలో శ్రీసత్యసాయి జిల్లాలోని గాండ్లపెంటలోని తూపల్లి 94.03 స్కోరు సాధించింది. మౌలిక వసతుల్లో ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం మండలం గుండమాల 92.50 స్కోరు, సామాజిక భద్రతలో కృష్ణా జిల్లాలోని సోవరగూడెం 88.80 స్కోరు, సుపరిపాలనలో చిత్తూరు జిల్లా సి.రెడ్డిగారిపల్లె 90.16 స్కోరు సాధించాయి. మహిళా అనుకూల విధానాల్లో పల్నాడులోని దుర్గి గ్రామం 92.92 స్కోరుతో ఉత్తమ పనితీరును కనబర్చింది.

Updated Date - Apr 30 , 2026 | 03:58 AM