సేంద్రీయ సాగులో ఏపీ దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:46 AM
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం ద్వారా సేంద్రీయ వ్యవసాయంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం చాన్సలర్ అబ్దుల్ నజీర్ తెలిపారు
పరిశోధనలు సాగు సమస్యలకు సమాధానాలివ్వాలి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
బాపట్ల, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం ద్వారా సేంద్రీయ వ్యవసాయంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం చాన్సలర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అంగ్రూ 58వ స్నాతకోత్సవం బాపట్ల ఏజీ కళాశాలలో శనివారం జరిగింది. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేసిన అనంతరం గవర్నర్ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని వంద శాతం సేంద్రీయ సాగు వైపు మళ్లించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, ఎల్‌నినో వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు అవసరమన్నారు. వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమే కాదని, అదొక జీవన విధానమని చెప్పిన భారతదేశ హరిత విప్లవ రూపశిల్పి భారతరత్న డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ స్ఫూర్తిని సదా చాటాలన్నారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులు ఎన్నో పర్యావరణ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ పరిశోధనలు క్షేత్రస్థాయిలో వాస్తవ సాగు సమస్యలకు పరిష్కారాలుగా మారాలని గవర్నర్ ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఆర్‌ఐ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తానూ ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం ఎంతో అనందంగా ఉందన్నారు. ప్రస్తుతం సాగును సంక్షోభంలోకి నెట్టివేస్తున్న ఎల్‌నినో పరిస్థితులపై ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వైస్ చాన్సలర్ పీవి.సత్యనారాయణ యూనివర్సిటీ ప్రగతిపై నివేదిక సమర్పించారు. 2024-25 ఏడాదికి గాను మొత్తం 1,675 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు.