Share News

ఇక వేగంగా విముక్తి!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:05 AM

రాష్ట్రంలో పట్టా భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రెవెన్యూ శాఖ సమాయత్తమైంది. హైకోర్టు తీర్పులతో ముడిపడిన, ప్రభుత్వ ఆదేశాలున్న రెగ్యులర్‌ పట్టా భూములను జాప్యం లేకుండా...

ఇక వేగంగా విముక్తి!

  • ‘22ఏ’పై కలెక్టర్‌ అధికారాల వికేంద్రీకరణ!

  • వీటిలో కొన్ని జేసీ, ఆర్‌డీవోలకు బదలాయింపు

  • పట్టా భూముల పరిష్కార బాధ్యత వీరికే

  • ఇనాం సర్వీసు, చుక్కల భూముల అంశం కూడా

  • సీఎంతో చర్చించాక త్వరలోనే విధివిధానాలు

  • సీఎస్‌, సీసీఎల్‌ఏ భేటీలో నిర్ణయం

  • ఫ్రీహోల్డ్‌పై అదే తర్జనభర్జన.. త్వరలో స్పష్టత

  • సర్వీసు ఇనాం భూములపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో పట్టా భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రెవెన్యూ శాఖ సమాయత్తమైంది. హైకోర్టు తీర్పులతో ముడిపడిన, ప్రభుత్వ ఆదేశాలున్న రెగ్యులర్‌ పట్టా భూములను జాప్యం లేకుండా త్వరితగతిన 22ఏ నుంచి తొలగించేలా ఇప్పుడున్న విధివిధానాలను సడలించాలని తాజాగా నిర్ణయించింది. ఇందులో భాగంగా కలెక్టర్ల వద్ద కేందీకృతమైన అధికారాలను వికేంద్రీకరించాలని భావిస్తోంది. సోమవారం ఇదే అంశంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎ్‌సగానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి, ఇతర సీనియర్‌ అధికారులు సమావేశమై చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 22ఏ కేసుల పరిష్కారంలో జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ), రెవెన్యూ డి విజనల్‌ అధికారి (ఆర్‌డీవో)లను కూడా భాగస్వాములను చేసేలా అధికారాల వికేంద్రీకరణ, బదలాయింపు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.


ఆచరణలో సంక్లిష్టం..

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం నిషేధ భూముల జాబితాలో ఉన్న ఏ భూమిని తొలగించాలన్నా ప్రభుత్వ స్థాయిలో రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకోవాలి. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు పంపించాలి. కలెక్టర్‌ తన వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఏ భూమిని 22ఏ నుంచి తొలగించాలో రిజిస్ట్రేషన్‌ అధికారులకు ఆదేశాలిస్తారు. పైకి ఈ ప్రక్రియ సులభంగానే కనిపిస్తున్నా.. ఆచరణలో మాత్రం సంక్లిష్టంగా ఉంది. దరఖాస్తులు తీసుకున్నంత వేగంగా విచారణ జరగడం లేదు. ఒకవేళ విచారణ జరిగినా సంబంధిత భూమిని 22ఏ నుంచి తొలగించాలో వద్దో కలెక్టర్లు ఓ పట్టాన నిర్ణయాలు తీసుకోవడం లేదు. దీనివల్ల పేదలు, సామాన్యుల్లో తీవ్ర ఆందోళన, అలజడి నెలకొంటోంది. వారు సహజంగానే సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్నారు. రెవెన్యూ మంత్రి, ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌, సీసీఎల్‌ఏ, ఇతర అధికారుల చుట్టూ నిరంతరం ప్రదక్షిణలు చేస్తున్నారు. మంత్రి, సీసీఎల్‌ఏ ఆదేశాలు ఇస్తున్నా జిల్లా కలెక్టర్లు సకాలంలో స్పందించడం లేదు. నిబంధనల ప్రకారం సత్వరమే నిర్ణయాలు తీసుకోవాల్సిన భూముల దరఖాస్తులను కూడా జిల్లాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. డబ్బు, పలుకుబడి, రాజకీయ నేపథ్యం, సిఫారసులు ఉన్న భూములు వేగంగా నిషేధ విముక్తి పొందుతుంటే.. పేదలు, సామాన్యుల భూములకు మోక్షమే దొరకడం లేదన్న విమర్శలున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సమావేశాల్లో రెవెన్యూ శాఖను ఆదే శించారు. ఈ నేపథ్యంలో దీనిపై సీఎస్‌ సాయుప్రసాద్‌ దృష్టి సారించారు. నిషేధ జాబితా విముక్తికి అమల్లో ఉన్న నిబంధనలను సులభతరం చేస్తూ గత ఏడాది నవంబరు-డిసెంబరుల్లోనే అనేక మార్గదర్శకాలు ఇచ్చారు. కానీ అవి ఆశించిన స్థాయిలో అమల్లోకి రాలేదు. దీనికి తోడు ఫ్రీహోల్డ్‌ భూముల సమస్య కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ రెండింటికీ తక్షణ పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది.


సోమవారం ఉదయం సాయిప్రసాద్‌ మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకు.. తమ భూములను నిషేధ జాబితా నుంచి భూములు తొలగించాలని 12 వేల దరఖాస్తులు వచ్చాయి. అలాగే తమ భూములను అన్యాయంగా నిషేధ జాబితాలో చేర్చారని, వాటిని ప్రభుత్వ భూముల కేటగిరీలో చేర్చారని, రికార్డులు పరిశీలించి వెంటనే విముక్తి కల్పించాలని మరో 8 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇవికాకుండా.. గత వైసీపీ ప్రభుత్వంలో నిషేధ విముక్తి కోరుతూ వచ్చిన దరఖాస్తులు 32 వేలకుపైగా ఉన్నాయి. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం జిల్లాల స్థాయిలో కలెక్టర్లే వీటిని పరిష్కరించాలి. కానీ ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ వద్ద ఉన్న కొన్ని అధికారాలను జేసీ, ఆర్‌డీవోలకు బదలాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తొలి ప్రాధాన్యంగా పట్టా భూములను పరిష్కరించే బాధ్యతను వీరికి అప్పగించనున్నట్లు సమాచారం. అలాగే ఇనాం సర్వీసు భూములను, చుక్కల భూములను నిషేధ జాబితా నుంచి తప్పించే అధికారాన్ని కూడా ఆర్‌డీవోలకు అప్పగించే ఆలోచన చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ భూములుగా భావించి 22ఏలో చేర్చిన పట్టా భూములపై నిర్ణయాధికారాన్నీ వారికే అప్పగించే అవకాశం ఉంది. ఇలా కలెక్టర్‌ వద్ద ఉన్న అధికారాలను వికేంద్రీకరిస్తే.. దరఖాస్తుల పరిష్కారం సులభతరంగా, వేగంగా సాగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో 22ఏ భూముల తొలగింపునకు సంబంధించిన అధికారాలను జిల్లా స్థాయి నుంచి సబ్‌ డివిజన్‌ లేదా సబ్‌ రిజిస్ట్రార్‌ స్థాయికి తీసుకురావడంపైనా చర్చలు జరిగాయి. ఈ నిర్ణయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చించి కొత్త విధివిధానాలను విడుదల చేస్తారు. నిషేధ జాబితా నుంచి సర్వీసు ఇనాం భూములను తొలగించాలని గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. ఈ భూములకు విముక్తి కల్పించే విషయంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని నిర్ణయించారు. దీనిపై సీఎంతో ప్రకటన చేయించనున్నట్లు తెలిసింది.


ఫ్రీహోల్డ్‌పై కింకర్తవ్యం.!

చట్టం పరిధిలో, నిబంధనల ప్రకారం ఫ్రీ హోల్డ్‌ అయిన 8 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు విముక్తి కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయగా.. ఇందులోని కీలక మంత్రులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ భిన్నాభిప్రాయాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్‌ చేసిన 5.75 లక్షల ఎకరాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ముఖ్యమంత్రికే వదిలేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఆయనకు ఎలాంటి ప్రతిపాదనలు సమర్పించాలన్న అంశంపై రెవెన్యూ శాఖ తర్జనభర్జన పడుతోంది. సీఎ్‌స-సీసీఎల్‌ఏఏ భేటీలో దీనిపైనా చర్చ జరిగింది. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.

Updated Date - Apr 07 , 2026 | 05:06 AM