విద్యకు భారీ కేటాయింపులు
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:04 AM
విద్యా రంగానికి 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తంగా విద్యా రంగానికి 36,107 కోట్లు కేటాయించింది.
పాఠశాల విద్యకు 32,308 కోట్లు
తల్లికి వందనం పథకానికి 9,668 కోట్లు
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): విద్యా రంగానికి 2026-27 బడ్జెట్‌లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తంగా విద్యా రంగానికి 36,107 కోట్లు కేటాయించింది. ఇది మొత్తం బడ్జెట్‌లో సుమారుగా 11 శాతం. పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.1500 కోట్లు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు. ఉన్నత విద్యా శాఖకు రూ.2567 కోట్లు కేటాయించింది. యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేలా తీర్చిదిద్దేందుకు.. నైపుణ్యాభివృద్ధి- శిక్షణ శాఖకు రూ.1,232 కోట్లు కేటాయించింది. 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఏటా రూ.15వేలు ఇచ్చే తల్లికి వందనం పథకానికి రూ.9,668 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యలో ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఫీజుల కింద రూ.3,836 కోట్లు, పాఠశాల విద్యలో సమగ్రశిక్ష విభాగానికి భోజనం పథకానికి రూ.2161 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర(స్టూడెంట్ కిట్లు)కు రూ.654 కోట్లు కేటాయించింది. మొత్తంగా విద్యా రంగానికి బడ్జెట్‌లో దాదాపు 11శాతం నిధులు కేటాయించింది.
చంద్రన్న బీమాకు 300 కోట్లు
కార్మిక శాఖకు ప్రభుత్వం అత్యధికంగా రూ.735.32కోట్లు కేటాయింపులు చేసింది. గతేడాది రూ.732 కోట్లు కేటాయించినా సవరించిన అంచనాల మేరకు 301కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. చంద్రన్న బీమా పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్లు కేటాయింది. ఈఎ్‌సఐ కార్పొరేషన్‌కు రూ.344.74 కోట్లు కేటాయించింది.
గృహ నిర్మాణానికి 6,357 కోట్లు
బలహీనవర్గాల గృహ నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,357.31 కోట్లు కేటాయించింది. గతేడాది రూ.6,317 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో రూ.2,017కోట్లు మాత్రమే చూపించింది. ఈ ఏడాది రూ.40 కోట్లు పెంచింది.
పర్యాటకానికి 294.61 కోట్లు
పర్యాటక, సాంస్కృతి, యువజన, క్రీడాశాఖలకు కలిపి బడ్జెట్‌లో రూ.439.26 కోట్లు కేటాయించింది. పర్యాటక శాఖకు రూ.294.61, క్రీడా, క్రీడాప్రాధికార సంస్థకు కలిపి రూ.116.38 కోట్లు, యువజన సర్వీసులకు రూ.24.35 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ.3.29 కోట్లు ఇస్తోంది. రూ.60 కోట్ల వరకూ 2027లో వచ్చే గోదావరి నది పుష్కరాల పనులకు ఉపయోగించాలని నిర్ణయించింది.