Share News

ఆంధ్రా పాప్‌కార్న్‌

ABN , Publish Date - Aug 25 , 2026 | 03:43 AM

ఆంధ్రా పాప్‌కార్న్‌ అందుబాటులోకి వస్తోంది. జన్యుపరంగా మార్పుచెందని మొక్కజొన్న నూతన వంగడాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.

ఆంధ్రా పాప్‌కార్న్‌

  • జన్యుపరంగా మార్పు చెందని మొక్కజొన్నకు శ్రీకారం

  • కొత్త విత్తనాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, సీఎం

  • ఇది దేశంలోనే తొలి నాన్‌-జీఎంవో సీడ్‌

  • సాగులో స్వయం సమృద్ధే ఎన్‌డీఏ లక్ష్యం: సీఎం

  • వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్‌

  • తద్వారా విలువ పెరిగి రైతులకు లబ్ధి

  • యువత ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాలి

  • రైల్వేస్టేషన్లలో ఆంధ్రా పాప్‌కార్న్‌, అరకు కాఫీ

  • నదుల అనుసంధానంతో నీటి భద్రత

  • గోదావరి, కృష్ణా, కావేరి,పెన్నాని కలిపితే 4 రాష్ర్టాల్లో సమస్య పరిష్కారం

  • సీమను ఉద్యాన హబ్‌గా మార్చేలా కార్యాచరణ

  • రూ.లక్ష కోట్ల వ్యయంతో అభివృద్ధి

  • ముసునూరు సభలో చంద్రబాబు స్పష్టీకరణ

వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రాసెసింగ్‌ విలువలు జోడించి ఓ మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్లకు తరలిద్దాం. అప్పుడే విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుంది.

- సీఎం చంద్రబాబు

ఏలూరు/ముసునూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా పాప్‌కార్న్‌ అందుబాటులోకి వస్తోంది. జన్యుపరంగా మార్పుచెందని మొక్కజొన్న నూతన వంగడాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇది దేశంలోనే తొలి నాన్‌-జీఎంవో మొక్కజొన్న కావడం విశేషం. సోమవారం ఏలూరు జిల్లా ముసునూరులో గౌర్మెట్‌ పాప్‌కార్నికా సంస్థ ప్రాంగణంలో ఈ విత్తనాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ‘స్వదేశీ విధానంతో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయంసమృద్ధి సాఽధించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నదే కేంద్రం, రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాల ఆలోచన..’గా పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా, రైతులను పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నదే తమ సంకల్పమన్నారు. రైతులు ఉత్పత్తి చేసే పంటలకు విలువలను జోడించి ఎగుమతి చేయాలన్నదే ప్రభుత్వాల ధ్యేయమని తెలిపారు. పసుపు, మిరప, మొక్కజొన్న, ఆక్వా తదితర ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు చేరాలని ఆకాంక్షించారు. ఆసియా మార్కెట్‌ నుంచి ప్రపంచంలోని పాప్‌కార్న్‌ గ్లోబల్‌ మార్కెట్‌ను విస్తరించే స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ ఎదుగుతుందన్నారు.


దేశీయంగా మొక్కజొన్న విత్తన ఆవిష్కరణ శుభ పరిణామమని తెలిపారు. ‘మామూలుగా పనిచేస్తే జీవితాలు మూమాలుగానే ఉంటాయి. వినూత్నంగా పనిచేస్తేనే ఎదుగుదల సాధిస్తామని గౌర్మెట్‌ నిరూపించింది. అరకు కాఫీ, పాప్‌కార్న్‌ రైతులపై ఉన్న ప్రేమాభిమానాలతో ఉపరాష్ట్రపతి ఇక్కడకు వచ్చి.. జన్యుమార్పిడి జరగని మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించారు. మన నూజివీడు గడ్డపై పండే పాప్‌కార్న్‌ మొక్కజొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. యాంత్రీకరణ, విత్తనాల సాగులో సాంకేతికత, రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు.. ఇలా అన్నీ వ్యవస్థీకృతం చేసిన గౌర్మెట్‌ సంస్థకు అభినందనలు. ఆంధ్రా పాప్‌కార్న్‌, అరకు కాఫీ కోసం రైల్వేస్టేషన్లలో కౌంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం’ అని వెల్లడించారు. కొండపల్లి కొయ్యబొమ్మల వంటి స్వదేశీ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్లాలన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


10 శాతమే ప్రాసెసింగ్‌..

మన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ప్రాసెసింగ్‌ చేసి విలువ జోడించే ప్రక్రియ చేపడతాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రక్రియతో ఉత్పత్తులకు విలువ పెరిగి.. రైతులకు ప్రయోజనం కలిగి.. సంపద సృష్టికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వాటిల్లో 10 శాతమే ప్రాసెసింగ్‌ చేయగలుగుతున్నాం. ప్రాసెసింగ్‌ పెంచితే అధిక సంపద ఆర్జించవచ్చు. ప్రత్యేకించి యువత ఈ రంగంపై దృష్టి పెట్టాలి. ప్రతి కుటుంబం నుంచీ ఒక పారిశ్రామికవేత్త రావాలి. మన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్త ఉత్పత్తులుగా అభివృద్ధి చేయాలి. ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు పండించే తీరు మారాలి. నూజివీడు వద్ద ఇప్పుడు వ్యవసాయంతో పాటు కోకో, ఆక్వా లాంటి వాణిజ్య పంటలు పెరిగాయి. వ్యవసాయంతో పాటు ఉద్యాన పంటల్లో అగ్రగామిగా మారాం. రాయలసీమను ఉద్యానపంటల హబ్‌గా మార్చేలా కార్యాచరణ చేపట్టాం.

నెలాఖరులో వెలిగొండ ప్రారంభం..

వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభిస్తాం. ఎల్‌నినో వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశముంది. పప్పుధాన్యాల లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు చేపట్టాం. నీటి భద్రత సాధించి ప్రతి ఎకరాకు నీరిచ్చేలా చర్యలు చేపడతాం. దేశమంతా నదుల అనుసంధానం జరిగి నీటి సద్వినియోగం జరగాలన్నది ఎన్‌డీఏ ప్రభుత్వ ఆలోచన. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ర్టాల్లో సమస్య పరిష్కారమవుతుంది. కష్టకాలంలో అన్ని ప్రాంతాల్లో ఆయకట్టు స్థిరీకరణ, తాగునీరు అందించే అవకాశం ఉంటుంది.

Updated Date - Aug 25 , 2026 | 03:46 AM