ఎజెండాను మార్చేసిన ‘ఆంధ్రజ్యోతి’
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:28 AM
రాష్ట్ర మంత్రి మండలి ఎజెండాను ‘ఆంధ్రజ్యోతి’ కథనం మార్చేసింది. నిర్దేశిత ఎజెండాపై చర్చించేందుకు రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఉదయం 10.30కు సమావేశం కావాల్సి ఉంది.
రాష్ట్ర మంత్రి మండలి ఎజెండాను ‘ఆంధ్రజ్యోతి’ కథనం మార్చేసింది. నిర్దేశిత ఎజెండాపై చర్చించేందుకు రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఉదయం 10.30కు సమావేశం కావాల్సి ఉంది. క్యాబినెట్ సమావేశానికి ముందు అమెరికా -భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకంటూ ఎన్డీయే పక్షాలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే... ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘వైవీని వదిలేస్తారా?’ అనే కథనంపై చర్చించేందుకే సీఎం ఆ భేటీ నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కథనంలో ప్రస్తావించిన అంశాలు సంచలనం సృష్టించాయి. టీడీపీతోపాటు జనసేన, బీజేపీ శ్రేణులు మొదలుకొని బ్యూరోక్రాట్లు, అధికారులు వరకు.. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ తీరుపై చర్చ మొదలైంది. సూత్రధారులపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తాయి. తాజా పరిణామాల తీవ్రతను గుర్తించి... క్యాబినెట్ భేటీకి ముందు ఎన్డీయే పక్ష మంత్రులతో దీనిపై చర్చ జరిపారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి... కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన ఈ అంశంపైనే క్యాబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. ఎజెండా అంశాలను పక్కన పెట్టేసి, కల్తీ నెయ్యి వ్యవహారంపైనే దృష్టి సారించారు.