అరెస్ట్ చేస్తారనేందుకు ఆధారాలు ఉన్నాయా?
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:22 AM
తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలన్న వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రెటరీ పూడి శ్రీహరి, జి.గిరీశ్‌కుమార్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలెందుకు: హైకోర్టు
పూడి శ్రీహరి, గిరీశ్‌కుమార్ పిటిషన్‌పై 29న తుది విచారణ
అమరావతి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలన్న వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రెటరీ పూడి శ్రీహరి, జి.గిరీశ్‌కుమార్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. శ్రీహరి, గిరీశ్‌కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము సస్పెండ్ మాత్రమే చేశామని, వాటిని రద్దు చేయలేదని గుర్తుచేసింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళనకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చిన గత మూడు నాలుగు రోజులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదా! అని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని అడిగింది. పిటిషనర్లను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారని ఆయన బదులివ్వడంతో ఆమేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పిటిషన్లపై ఈ నెల 29న తుది విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం తదుపరి విచారణ తేదీ వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని సీనియర్ న్యాయవాది మరోసారి అభ్యర్థించగా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. సీఎం చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో శ్రీహరి, గిరీశ్‌కుమార్‌రెడ్డికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కుప్పం అర్బన్ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు... కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ పిటిషన్లు బుధవారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్ తరఫున పొ న్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. తమ వాదనలు వినకుం డా ఈ నెల 17న ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారన్నారు. న్యాయమూర్తి జో క్యం చేసుకుంటూ ఆ రోజు మీ కోసం, మీ జూనియర్ల కోసం ఎదురుచూశామని, ఎవరూ స్పందించకపోడంతోనే ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు.