Share News

పెన్షన్‌.. ఉద్యోగి ఆస్తి హక్కు

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:54 AM

‘పెన్షన్‌ అనేది యాజమాని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఇచ్చే పారితోషికం కాదు. అది ఉద్యోగి ఆస్తి హక్కు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని గుర్తు చేసింది.

పెన్షన్‌.. ఉద్యోగి ఆస్తి హక్కు

  • యజమాని ఇష్ట ప్రకారం ఇచ్చే పారితోషికం కాదు

  • హథీరామ్జీ మఠంలో రామయ్య ఉద్యోగిగా సేవలు అందించారు

  • ఆయనపై మోపిన ఆరోపణలేవీ రుజువు కాలేదు

  • అది ఉద్యోగి జీవించే హక్కును హరించడమే: హైకోర్టు

  • రామయ్యకు పెన్షన్‌ బకాయిలు, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు చెల్లించండి

  • దేవదాయ శాఖ, మఠం అధికారులను ఆదేశించిన ధర్మాసనం

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘పెన్షన్‌ అనేది యాజమాని ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఇచ్చే పారితోషికం కాదు. అది ఉద్యోగి ఆస్తి హక్కు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని గుర్తు చేసింది. కనుక పిటిషనర్‌కు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలతోపాటు పెన్షన్‌ బకాయిలను ఎనిమిది వారాల్లో విడుదల చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌, హథీరామ్జీ మఠం మహంత్‌ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తువ్వ చెన్నుపల్లి కి చెందిన బి.రామయ్య 1968 నవంబరులో తిరుపతిలోని శ్రీస్వామి హథీరామ్జీ మఠంలో క్లర్క్‌గా నియమితులయ్యారు. తదనంతరం సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. అయితే మఠం పరిపాలనాధికారి ఫిర్యాదు మేరకు ఫోర్జరీ, మోసం ఆరోపణలతో రామయ్యతోపాటు మరికొందరు ఉద్యోగులపై 2004 ఆగస్టులో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో రామయ్య అదే ఏడాది సెప్టెంబరులో సస్పెండ్‌ అయ్యారు. 2006 ఆగస్టులో రామయ్య పదవీ విరమణ చేశారు. క్రిమినల్‌ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉందనే కారణంతో మఠం నిర్వాహకులు రామయ్యకు పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్‌ నిలిపివేశారు. వాటి కోసం 2014లో రామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘పిటిషనర్‌ వయస్సు 79ఏళ్లు. భార్య, కుమారుడు ఇప్పటికే మరణించారు.


జీవనోపాధికి ఎలాంటి ఆదాయ వనరులు లేవు. పిటిషనర్‌పై శాఖాపరమైన విచారణ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. క్రిమినల్‌ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులోని ఐదుగురు నిందితులు మరణించారు’ అని నివేదించారు. హథీరామ్జీ మఠం తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ వాదనలు వినిపిస్తూ 1996 పెన్షన్‌ రూల్స్‌ ప్రకారం ఉద్యోగిపై కేసులు పెండింగ్‌లో ఉంటే... పెన్షన్‌ ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడన్నారు. పిటిషనర్‌ ప్రభుత్వ అధికారి నిర్వచనం పరిధిలోకి రారన్నారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు దేవాదాయశాఖ కమిషనర్‌ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌ను విచారణాధికారిగా నియమించారని గుర్తు చేశారు. స్టాండింగ్‌ కౌన్సిల్‌లో వాదనలో అర్థం లేదన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 03:55 AM