Share News

వీసీపై ప్రభుత్వం సీరియస్‌!

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:22 AM

ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతూ ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ వీసీ శారదా జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం సీరియస్‌ అయినట్టు సమాచారం.

వీసీపై ప్రభుత్వం సీరియస్‌!

  • వయస్సు పెంపు ఉత్తర్వులపై ఆగ్రహం

  • ‘65 ఏళ్ల’పై కేసు నడుస్తుండగానే ‘సొంత’ నిర్ణయం

  • రంగా వర్సిటీ వీసీ తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం

  • సమగ్ర విచారణకు సర్కారు ఆదేశం

గుంటూరు సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల వయోపరిమితిని పెంచుతూ ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ వీసీ శారదా జయలక్ష్మి జారీచేసిన ఉత్తర్వులపై ప్రభుత్వం సీరియస్‌ అయినట్టు సమాచారం. ఇంత కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వ అనుమతులు లేకుండా, హైకోర్టులో కేసు నడుస్తుండగానే వీసీ తీసుకున్న వైనాన్ని ‘వయస్సు’పై తొందరపాటు’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం వెలుగులోకి తెచ్చింది. 62ఏళ్ల నుంచి 65 ఏళ ్లకు పదవీవిరమణ వయస్సును పెంచుతూ వీసీ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతస్థాయిలో ఆదేశాలు జారీ అయినట్టు తెలియవచ్చింది. సాధారణంగా వయోపరిమితి పెంపు వంటి కీలక అంశాలు ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం అవుతాయి. క్యాబినెట్‌ ఆమోదంతో అమలవుతాయి. కానీ వీసీ సొంత నిర్ణయం తీసుకోవడంపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో సంబంధిత అధికారుల పాత్ర, నిర్ణయ ప్రక్రియపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా కఠిననిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మార్గదర్శకాలు రూపొందించడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. వీసీపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


సొంత లాభం కోసమేనా?!

ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందికి పొడిగింపు ఇవ్వడమే కాకుండా, రిటైర్మెంట్‌కు చేరువలో ఉన్నవారికీ వర్తింపజేసే విధంగా రంగా యూనివర్సిటీ వీసీ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత వీసీ ఈ ఏడాది ఆగస్టులో పదవీవిరమణ చేయనున్నట్టు తెలిసింది. మరో మూడేళ్ల పొడిగింపు నిర్ణయం తీసుకోవడానికి ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఈ అంశంపై న్యాయపరమైన కోణంలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, వీసీ ఉత్తర్వుల ప్రభావం వర్సిటీ వ్యవస్థపై పడే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పదోన్నతులు నిలిచిపోయే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పదోన్నతుల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నవారికి ఈ నిర్ణయం పెద్ద దెబ్బగా మారే అవకాశముంది. మరోవైపు, యువ అధ్యాపకులకు అవకాశాలు తగ్గిపోతాయని విద్యా వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - Mar 18 , 2026 | 04:23 AM