మైనారిటీలకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:50 AM
రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర మైనారిటీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మక్కాలో ప్రార్థించండి: మంత్రి ఫరూక్
బెజవాడలో హజ్‌భవన్ నిర్మిస్తాం
హజ్‌యాత్ర ప్రారంభం.. మొదటి దశలో 156 మంది పయనం
విజయవాడ/గన్నవరం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర మైనారిటీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి శనివారం మొదటి దశలో 156 మంది యాత్రికులు హజ్‌యాత్రకు బయల్దేరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గన్నవరంలోని ఎస్‌ఎం కన్వెన్షన్ సెంటర్‌లో యాత్రికులకు విడిది ఏర్పాటు చేశారు. విడిది కేంద్రం నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు యాత్రికులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులు, కార్గో వ్యాన్లు ఏర్పాటుచేశారు. ఈ యాత్రను మంత్రులు ఎన్‌ఎండీఫరూక్, కొల్లు రవీంద్ర, మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం), నసీర్ అహ్మద్(గుంటూరు తూర్పు) తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విజయవాడలో అన్ని సౌకర్యాలు, అత్యాధునిక సదుపాయాలతో హజ్‌భవన్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేందుకు దైవానుగ్రహం కలగాలని పవిత్ర మక్కాలో ప్రార్థించాలని హజ్ యాత్రికులను కోరారు. రాష్ట్రం నుంచి దాదాపు 2వేల మంది హజ్‌యాత్రకు వెళ్తున్నారని, వీరిలో 333 మంది రెండు దశల్లో విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి బయల్దేరనున్నారని చెప్పారు. విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లేవారికి ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే మైనారిటీలపై ఉన్న అంకితభావానికి నిదర్శనమన్నారు. హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్, హజ్ కమిటీ చైర్మన్ హసన్‌బాషా చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, షేక్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.