Share News

ఆ అధికారి ఔట్‌!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:39 AM

రెవెన్యూలో అవినీతి అధికారిపై వేటు పడింది. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో సర్కారు కదిలింది. ఆ అధికారిని టర్మినేట్‌ చేద్దామనుకునే లోగా, కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఆయన్నే రాజీనామా చేయాలని ఆదేశించారని తెలిసింది.

ఆ అధికారి ఔట్‌!

  • తొలగింపునకు సిద్ధమైన ప్రభుత్వం

  • పెద్దల జోక్యంతో ఆయనే రాజీనామా

  • రెవెన్యూ ఉన్నతాధికారులకు లేఖ రిటైర్డ్‌ అధికారికి అందలం ఎక్కించారన్న

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

  • సీఎం కార్యాలయం, ప్రభుత్వ వర్గాల ఆరా

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): రెవెన్యూలో అవినీతి అధికారిపై వేటు పడింది. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంతో సర్కారు కదిలింది. ఆ అధికారిని టర్మినేట్‌ చేద్దామనుకునే లోగా, కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఆయన్నే రాజీనామా చేయాలని ఆదేశించారని తెలిసింది. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. సోమవారం ఈ లేఖపై అధికారికంగా సీసీఎల్‌ఏ కార్యాలయంనిర్ణయం తీసుకోనుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ చేయిస్తామని రెవెన్యూ శాఖ తెలిపింది. విశాఖ జిల్లా భీమిలిలో పనిచేసిన రెవెన్యూ రిటైర్డ్‌ అధికారికి రెవెన్యూలో కీలక పోస్టు ఇవ్వడంపై ‘ఆయనే కావాలి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ వార్తను ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎంవో, ప్రభుత్వ వర్గాలు ఆరా తీశాయి. ఎవరా ఆధికారి? ఎవరి సిఫారసుతో ఉద్యోగం ఇచ్చారు? ఆయనపై ఉన్న ఏసీబీ కేసులు, వాటి తీవ్రత ఏమిటి? అన్నదానిపై నిఘావర్గాలతో పాటు రెవెన్యూ నుంచి కూడా కీలక సమాచారం తెప్పించుకున్నారు. ఆ అధికారి పేరు బీటీవీ రామారావు అని, ఆయన భీమిలి తహశీల్దార్‌గా పనిచేస్తు న్న సమయంలో తీవ్ర ఆరోపణలపై ఏసీబీ దాడులు నిర్వహించిందని, ఇంకా ఆ కేసులు కొలిక్కిరాలేదని సమాచారం వచ్చింది.విశాఖలోని ఓ కీలక ప్రజాప్రతినిధి సిఫారసుతో రెవెన్యూలో ఉద్యోగం ఇప్పించారని, తొలుత అధికారులు నిరాకరించినా, ఫైలును ఆమోదించకుండా ఆపినా, ఉన్నతస్థాయి ఒత్తిళ్లు తీసుకొచ్చి ఉద్యోగం ఇప్పించారని తెలిసింది. మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో ఆయనకు ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో పోస్టు ఇచ్చారని, కానీ ఆయన పని మాత్రం మరో కీలక ఆఫీసులో సాగిందని ప్రభుత్వానికి వాస్తవిక నివేదికలు అందాయి.


దీంతో సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపున ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ కూడా ఆరా తీసి సీఎంకు బ్రీఫ్‌ చేసినట్లు తెలిసింది. ఆయనపై ఏసీబీ కేసులు, ఇతర ఆరోపణల తీవ్రత ఉన్నా ఎవరు రెవెన్యూలోకి తీసుకొచ్చారు? గత రెండున్నర నెలలుగా ఎలాంటి బాధ్యతలు అప్పగించారన్న అంశాలపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆయన్ను టర్మినేట్‌ చేయాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించారు. దీనివల్ల సమస్యలు రావొచ్చని భావించిన కొందరు పెద్దలు నేరుగా ఆ అధికారికే ఫోన్‌ చేసి టర్మినేషన్‌ దాకా తీసుకురావద్దని, వెంటనే పోస్టుకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నానికే అమల్లోకి వచ్చింది. బీటీవీ రామారావే తన పోస్టుకు రాజీనామా చేస్తూ రెవెన్యూ అధికారులకు సమాచారం పంపించారు. రెవెన్యూ ఉన్నతాఽధికారులకు మెయిల్‌, వాట్సాప్‌, ఇతర డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రాజీనామా లేఖను పంపించారు. ఈ విషయాన్ని రెవెన్యూ వర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఇంతటితో ప్రభుత్వం శాంతించలేదు. గత రెండున్నర నెలలుగా ఆయన ఏ ఆఫీసులో పనిచేశారు? ఎలాంటి ఫైళ్లు చూశారు? విశాఖ, విజయనగరం జిల్లా, భోగాపురం పరిధిలోని అధికారులతో ఆయన ఎలాంటి కార్యాలు నడిపారు? ఫోన్‌ ద్వారా ఇచ్చిన ఆదేశాలు ఏమిటన్నదానిపై సమగ్ర సమాచారం తెప్పించుకుంటోంది. నిఘా విభాగం ఆదివారం సాయంత్రానికే కీలకమైన నివేదికను సీఎంకు పంపించినట్లు తెలిసింది.


వద్దన్నా.. ఒత్తిళ్లు

ఆ రిటైర్డ్‌ అధికారికి పోస్టింగ్‌ ఇవ్వడం వెనుక పైస్థాయిలో పైరవీలు జరిగాయి. సీసీఎల్‌ఏలో పోస్టింగ్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పుడు అధికారులు మొదట్లో వ్యతిరేకించారు. నెల రోజులపాటు ఈ అంశంపై స్పందించలేదు. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వంలో మరో కీలకమైన నేతతో రాయబారం నడిపించిన తర్వాత రెవెన్యూ పెద్దలు పోస్టింగ్‌ ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం.

Updated Date - Apr 27 , 2026 | 04:45 AM