Share News

సిట్‌ నివేదికపై విచారణ కమిటీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:50 AM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీనెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది.

సిట్‌ నివేదికపై విచారణ కమిటీ

  • చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకున్నాక దీనిపై తేలుస్తాం

  • అవసరమైతే ప్రభుత్వం, టీటీడీ, భక్తులు కూడా కేసులో కలుస్తారు

  • మంత్రివర్గం నిర్ణయం.. దోషులపై కఠిన చర్యలు తథ్యం: మంత్రులు

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీనెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై రాష్ట్రప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు సీబీఐ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై ప్రత్యేక విచారణ కమిటీని నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్‌.. సిట్‌ నివేదికపై మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కూటమి పార్టీలకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, సత్యకుమార్‌, కొలుసు పార్థసారథి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిట్‌ ఇటీవల దాఖలుచేసిన చార్జిషీటును నెల్లూరు ఏసీబీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ కేసుపై స్పందిస్తామన్నారు. నిజమైన దోషులను తప్పించుకోవడానికి వీల్లేకుండా అవసరాన్ని బట్టి ప్రభుత్వం గానీ, టీటీడీ గానీ, భక్తులు గానీ.. ఆ కేసులో కలుస్తారని ప్రకటించారు. తొలుత పయ్యావుల మాట్లాడారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించి సత్వరమే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిట్‌ నుంచి ప్రభుత్వానికి రెండు పత్రాలు అందాయన్నారు. కోర్టు చార్జిషీటును అధికారికంగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అది ప్రభుత్వానికి, సంబంధిత కక్షిదారులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘సిట్‌ నివేదికలో పేర్కొన్న ప్రధాన అంశాలు, తేలిన లోపాలపై విస్తృత స్థాయిలో చర్చించాం. 2019 తర్వాత టీటీడీ నెయ్యి కొనుగోలు విధానంలో అనవసరమైన సడలింపులు చేసి.. నాణ్యతకు విరుద్ధమైన సరఫరాలు జరగడానికి అవకాశం కల్పించారు.


టెండర్‌ నిబంధనల్లో రూ.250 కోట్ల టర్నోవర్‌ షరతును రూ.150 కోట్లకు తగ్గించడం, పాల సేకరణలో కనీస అనుభవం లేకున్నా అర్హత కల్పించడం వంటి చర్యలను ఉద్దేశపూర్వకంగా చేపట్టారని నివేదిక స్పష్టం చేసింది. నెయ్యి నమూనాలను పరిశీలించిన ఎన్‌డీడీబీ-కా్‌ఫ ల్యాబ్‌ నివేదికలో పలు అనుమానిత కల్తీ పదార్థాలు సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌, రేప్‌సీడ్‌, కాటన్‌సీడ్‌, ఫిష్‌ ఆయిల్‌, బీఫ్‌టాలో, లార్డ్‌ మొదలైనవి ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు ప్రజావేదికపై ఈ అంశాన్ని ప్రస్తావించారు. 2022లో సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ చేసిన హెచ్చరికలనూ గత పాలకులు పట్టించుకోలేదు. సుమారు 58 లక్షల లీటర్ల వరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు నివేదికలో వెల్లడించారు. నివేదికలో ఏఈవో ధర్మారెడ్డి, అప్పటి టీటీడీ ఈవో అనిల్‌ సింఘాల్‌, సీఏవో బాలాజీ వంటి సీనియర్‌ అధికారుల పేర్లు ప్రస్తావించారు. టెండర్‌ నిబంధనల సడలింపు, నాణ్యత వైఫల్యంలో వీరు బాధ్యత వహించాలని నివేదిక పేర్కొంది’ అని వివరించారు.


వక్రీకరణ యత్నాలకు చెక్‌: నాదెండ్ల

కల్తీ నెయ్యి వ్యవహారంపై విస్తృతంగా క్యాబినెట్‌ సమావేశంలో చర్చించామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సహా మంత్రులందరూ భక్తుల మనోభావాలను కాపాడే దిశగా స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో వక్రీకరించే ప్రయత్నాలను నిరసిస్తూ.. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ పాలకులు వ్యవహరించారని, కల్తీ నెయ్యి విషయంలో రూ.250 కోట్ల అవినీతి కుంభకోణంతో పాటు పవిత్రతను నాశనం చేశారని మంత్రి సత్యకుమార్‌ ఆక్షేపించారు. మంత్రి పార్థసారథి తొలుత మాట్లాడుతూ.. అప్పట్లో తాను టీటీడీ కొనుగోలు కమిటీలో ఉన్నప్పటికీ.. అప్పటి ప్రభుత్వం భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించి.. తమ ప్రమేయం లేకుండానే విచ్చలవిడిగా చేశారని తెలిపారు.

Updated Date - Feb 04 , 2026 | 03:51 AM