సూత్రధారులను వదలొద్దు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:36 AM
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని క్యాబినెట్ భేటీలో మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సిట్ సమగ్రంగానే దర్యాప్తు జరిపినా..
‘కల్తీ నెయ్యి’పై మంత్రుల ముక్తకంఠం
‘సిట్’ లేఖపై క్యాబినెట్‌లో సుదీర్ఘ సమాలోచనలు
కల్తీకి దారితీసిన పరిణామాలు ‘లేఖ’లో నామమాత్రంగానే ప్రస్తావించారు
వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం
వైవీ పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది: డిప్యూటీ సీఎం
పథకం ప్రకారమే తిరుమల లడ్డూ కల్తీ
సెంటిమెంట్‌తో కూడిన అంశమిది: మంత్రులు
న్యాయపరంగా ముందుకెళ్లడంపై క్యాబినెట్ దృష్టి
అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ
చార్జిషీటుపై జడ్జి నిర్ణయం తర్వాతే ముందుకు: ఏజీ సలహా
అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని క్యాబినెట్ భేటీలో మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సిట్ సమగ్రంగానే దర్యాప్తు జరిపినా, అసలు సూత్రధారుల సంగతి చార్జిషీటులో పొందుపరిచారా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రాసిన లేఖలో సిట్ ‘కల్తీ నెయ్యి’ వ్యవహారంలో కొందరు అధికారులపైనే చర్యలకు సిఫారసు చేయడం, సూత్రధారుల పాత్ర ఏమిటనేది స్పష్టం చేయకపోవడంపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగానే చర్చ జరిగింది. ఈ క్రమంలో అసాధారణ రీతిలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివా్‌సను క్యాబినెట్ భేటీకి పిలిపించి సమాలోచనలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసిందని క్యాబినెట్ అభిప్రాయపడింది. సెంటిమెంట్‌తో కూడిన సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంతోపాటు ప్రభుత్వానికి సిట్ రాసిన 11 పేజీల లేఖపైనా సుదీర్ఘ చర్చ జరిగింది. సిట్ రాసిన లేఖలోని ప్రతి అంశంపైనా లోతుగా చర్చించారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని పలువురు మంత్రులు సీఎంకు సూచించారు.కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన కీలక పరిణామలను సిట్ లేఖలో నామమాత్రంగా ప్రస్తావించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. వాటిపై మరింత దృష్టి సారిస్తే అసలు దోషులు ఎవరో తేలే అవకాశం ఉందన్నారు.
‘2022 మేలో లడ్డూ నాణ్యత, కల్తీ నెయ్యి వాడకంపై ఫిర్యాదులు రాగా, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి నెయ్యి శాంపిల్స్‌ను మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు (సీఎఫ్‌టీఆర్‌ఐ) జూన్‌లో పంపారు. ఆగస్టులో నెయ్యిలో కల్తీ జరిగిందని నివేదిక వచ్చింది. ఈ నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టడంలో ఎవరి పాత్ర ఏమిటనే దానిపై మరింత లోతుగా విచారణ జరగాలి’ అని పవన్, మంత్రులు కోరారు. ‘సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికను ఎఫ్‌ఏ అండ్ సీఏవోగా ఉన్న బాలాజీ, మరో ఉద్యోగి సుబ్రమణ్యం కలిసి ధర్మారెడ్డికి అందజేసేందుకు వెళ్లారు. సుబ్రమణ్యంను బయటే ఉండమని చెప్పి బాలాజీ ఒక్కరే ధర్మారెడ్డి చాంబర్‌లోకి వెళ్లి నివేదిక విషయం తెలియజేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి సీఎ్‌పటీఆర్‌ఐ నివేదికను ప్రస్తుతానికి పక్కన పెట్టేయాలని చెబుతున్నారని బాలాజీ.. సుబ్రమణ్యంతో అన్నారు. అయితే, సిట్ నివేదికలో ధర్మారెడ్డికి అసలు సీఎ్‌ఫటీఆర్‌ఐ నివేదిక అంశమే తెలియదన్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఈ నివేదిక విషయం తెలిసినా, ఎందుకు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండిపోయారన్న దానిపైనా సిట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ అంశాలపై మరింత లోతుగా విచారణ జరిగితే బాగుండేది. వైవీ సుబ్బారెడ్డి పాత్రపై సిట్ మరింత స్పష్టత ఇస్తే బాగుండేది’ అని అభిప్రాయపడ్డారు. అలాగే... ‘టీటీడీ బోర్డు సభ్యుల్లో కొంతమందిని ఎంపిక చేసి పర్చేజింగ్ కమిటీని నియమిస్తారు. 2019లో ఏర్పాటయిన పర్చేజింగ్ కమిటీ నెయ్యి సేకరణ నిబంధనల సడలింపులో కీలకంగా వ్యవహరించింది. అయితే సడలింపు నిర్ణయం తీసుకునే సమయంలో ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతిని పిలవకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి (ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో) మాత్రమే సమావేశమై నిబంధనలను సడలింపునకు ఆమోదం తెలిపారు. దీని వెనుక అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఏమిటనే దానిపైనా మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉంది’’ అని మంత్రులు అభిప్రాయపడ్డారు.
క్యాబినెట్‌కు ఏజీ..
సిట్ లేఖలోని అంశాలను చర్చించి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చించేందుకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివా్‌సను క్యాబినెట్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా పవన్, మంత్రులు తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. నెయ్యి కొనుగోలు నిబంధనలను మార్చడంలో కీలకంగా వ్యవహరించిన టీటీడీ పర్చేజింగ్ కమిటీలో భాగస్వాములుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. సిట్ రాసిన లేఖలో కేవలం అధికారులపై చర్యలకు మాత్రమే సిఫారసు చేసిందని మంత్రులు తెలిపారు. అయితే, మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పాత్రను నిగ్గు తేల్చేలా ఎలా ముందుకు వెళ్లాలని ఏజీని అడిగారు. సిట్ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై ఏజీతో చర్చించారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందా అనే అంశంపైనా ఆరా తీశారు. చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్న అంశంపైనా చర్చ జరిగింది. చార్జిషీట్‌లో సూత్రధారుల పాత్ర సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదని న్యాయమూర్తి భావిస్తే, దాన్ని తిప్పి పంపవచ్చని ఏజీ తెలిపారు. కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి వస్తే బాగుటుందని ఆయన సూచించారు.
అవన్నీ చార్జిషీట్‌లో ఉన్నాయా?
కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ చాలా సమగ్రంగా విచారణ జరిపిందని, అయితే చార్జిషీట్‌లో వాటన్నింటినీ పొందుపరిచారో లేదోనంటూ పలువురు మంత్రులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. సిట్ ప్రభుత్వానికి రాసిన లేఖను పరిశీలిస్తే ఈ అనుమానం వ్యక్తమవుతోందని వారు వ్యాఖ్యానించారు. పాలు లేని కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు సడలించడమే కాకుండా ఆ సడలించిన నిబంధనలను కూడా ఆ కంపెనీలు చేరుకోలేక ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి మరీ టెండర్లు దక్కించుకున్నాయన్నారు. అయినా టీటీడీ చైర్మన్, పాలకమండలి చూస్తూ ఉరుకుండిపోయిందని తెలిపారు.