ప్రొటీన్ ఫుడ్డు.. గుడ్డు.. బెడ్డు..
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:51 AM
డ్రైవర్ హత్య కేసులో బెయిల్ రద్దయి, రాజమండ్రి జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు కాకినాడ జీజీహెచ్ వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది.
అనంతబాబుకు రోజుకు 2,400-2,500 హై క్యాలరీ ఫుడ్
80 గ్రాముల వరకు హై ప్రొటీన్ డైట్
జైల్లో గట్టి పరుపు.. సర్వైకల్ దిండు
భోజనంలో ఉడికించిన గుడ్డు తప్పనిసరి
ఎమ్మెల్సీ ఆరోగ్యంపై కోర్టుకు వైద్యుల నివేదిక
కాకినాడ, జూన్ 29(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ హత్య కేసులో బెయిల్ రద్దయి, రాజమండ్రి జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు కాకినాడ జీజీహెచ్ వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ఆయనకు రోజూ 2,400 నుంచి 2,500 వరకు హై క్యాలరీ ఫుడ్ ఇవ్వాలని, 80 గ్రాముల వరకు ప్రొటీన్ డైట్ అందించాలని, గట్టి పరుపు..సర్వైకల్ దిండు సమకూర్చాలని సిఫారసు చేసింది రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ జిల్లా జడ్జికి ఇచ్చిన ఈ నివేదికలోని అంశాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అనంతబాబు కొంతకాలం బెయిల్‌పై బయటే ఉన్నారు. అయితే, కేసులో సాక్షులను బెదిరించి అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా, న్యాయస్థానం ఈ ఏడాది ఏప్రిల్ 25న రిమాండ్ విధించింది. అప్పటినుంచీ రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తనకు గ్యాస్ట్రిక్ సమస్య, వెన్నునొప్పి ఉన్నాయని, అందువల్ల జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని న్యాయస్థానంలో ఇటీవల అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో, కాకినాడ జీజీహెచ్‌లో ఈనెల 20న పరీక్షలు చేశారు. కోర్టుకు వైద్య బృందం నివేదిక ఇచ్చింది. ఈ బృందంలో మెడికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వి.కిరణ్, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.రాజ్ కిశోర్, సైకో థెరపిస్ట్ సాయినాథరావు, డైటీషియన్ ఏ.సురేంద్రబాబు ఉన్నారు.
డైట్ షెడ్యూల్ ఇలా..
అల్పాహారం కింద 300గ్రాముల ఇడ్లీ, 100ఎంఎల్ పాలు, ఉడకబెట్టిన గుడ్డు; లంచ్‌లోకి 600 గ్రాముల అన్నం, 150 గ్రాముల కర్రీ, 100 గ్రాముల పప్పు, 200 ఎంఎల్ మజ్జిగ, ఉడకబెట్టిన గుడ్డు, అరటిపండు; సాయంత్రం 100ఎంఎల్ పాలు, 100 గ్రాముల పల్లీపట్టీ; డిన్నర్‌లోకి 450 గ్రాముల అన్నం, 150 గ్రాముల కర్రీ, 100 గ్రాముల పప్పు, 200 ఎంఎల్ బటర్ మిల్క్, ఉడకబెట్టిన గుడ్డు.