ఇదేం ‘మాయ రోగం!?’
ABN , Publish Date - Jun 20 , 2026 | 06:00 AM
దళిత డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అప్పట్లో 18 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
అనంతబాబు తీరుపై సర్వత్రా సందేహాలు
కోర్టు ఆదేశంతో ఎమ్మెల్సీకి వైద్య పరీక్షలు.. ఎల్లుండి కోర్టుకు నివేదిక
రాజమహేంద్రవరం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అప్పట్లో 18 నెలలపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు జైలులో అన్ని వసతులూ సమకూరాయి. ఇప్పుడు అదే అనంతబాబు... సాక్షులను బెదిరించిన కేసులో అరెస్టయి, మళ్లీ అదే జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆయన పప్పులుడకడం లేదు. ప్రత్యేక వసతులు కావాలంటే... ఏదో ఒక ‘ప్రత్యేక’ కారణం ఉండాలి! అదే... అనారోగ్యం! తనకు గ్యాస్ట్రిక్ సమస్య, వెన్నునొప్పి తదితర ఇబ్బందులు ఉన్నాయని అనంతబాబు పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక వసతులు కల్పించడంతోపాటు లీగల్ ఇంటర్వ్యూలను మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అనంతబాబుకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈమేరకు శుక్రవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వాస్పత్రికి అనంత బాబును తీసుకెళ్లి, వైద్యపరీక్షలు జరిపించారు. ఆ నివేదికను వచ్చే సోమవారం ఆస్పత్రి అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. అనంతబాబు పిటిషన్‌పై ఆ రోజున కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.