సాక్ష్యం చెబితే చంపేస్తా..!
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:48 AM
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్‌పై ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. సాక్షులను బెదిరించారు. వారిని చంపేస్తానని హెచ్చరించారు. చంపి మృతదేహాలను పారేస్తానని వాట్సాప్ వీడియోకాల్‌లో భయపెట్టారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపు
వాట్సాప్ వీడియోకాల్ ద్వారా హెచ్చరిక
చంపి మృతదేహాలను పారేస్తానని వార్నింగ్
రిమాండ్ రిపోర్టులో వెల్లడి
21 పేజీల నివేదికలో ఎమ్మెల్సీ నేరచరిత్ర
19 పోలీసు స్టేషన్లలో కేసులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్‌పై ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. సాక్షులను బెదిరించారు. వారిని చంపేస్తానని హెచ్చరించారు. చంపి మృతదేహాలను పారేస్తానని వాట్సాప్ వీడియోకాల్‌లో భయపెట్టారు. దొంగ కేసులు పెట్టిస్తానని హెచ్చరించారు. వారిని నిర్బంధించి ఖాళీ పత్రాలపై సంతకాలు కూడా తీసుకున్నారు. వ్యతిరేక సాక్ష్యం చెప్పకుండా వారికి డబ్బులు ఇచ్చి ప్రభావితం చేశారని అనంతబాబు రిమాండ్ రిపోర్టులో కేసు దర్యాప్తు అధికారి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టు తర్వాత పోలీసుల విచారణకు కూడా ఏ మాత్రం సహకరించలేదన్నారు. సాక్షులను బెదిరించిన కేసులో ఏ-2, ఏ-3 తప్పించుకుని తిరుగుతున్నారని తెలిపారు. అనంతబాబుకు రిమాండ్ విధించాలని కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్‌ను అభ్యర్థించారు. 21 పేజీల రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలు ప్రస్తావించారు.అందులోని ముఖ్యాంశాలివీ..
బయట ఉంటే కేసు విచారణకే రాదు!
హత్య కేసులో ఏ-1గా ఉన్న అనంతబాబు బెయిల్‌పై ఉండి కూడా సాక్షులను దారుణంగా బెదిరించారు. వారికి డబ్బులిచ్చారు. ఆధారాలను ధ్వంసం చేయాలని చూశారు. ఈ నేరాల నేపథ్యంలో రిమాండ్‌కు ఆదేశించాలి. ఆయన బయట ఉంటే కీలక దశలో ఉన్న హత్య కేసు విచారణకు కూడా ఇబ్బందులు ఉంటాయు. హత్య కేసు విచారణను ఈ ఏడాది నవంబరు నాటికి ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల కేసు మరింత వేగంగా ముందుకు వెళ్లేందుకు అనంతబాబును రిమాండ్‌కు పంపండి. అనంతబాబుకు తీవ్ర నేర చరిత్ర ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆయనపై మొత్తం 19 పోలీసు స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. సాక్షులు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా చేయడానికి ఆయన పురమాయించిన నిందితులందరికీ నేరచరిత్ర ఉంది. సాక్షులను బెదిరించిన కేసులో ఏ-2గా ఉన్న కడియాల మహాలక్ష్మి అలియాస్ చిన్నాపై ఎనిమిది కేసులు.. ఏ-3 కడియాల సతీశ్‌పై రెండు, ఏ-4 మాగంటి రాంబాబుపై నాలుగు కేసులు ఉన్నాయి. వీరందరి ద్వారా హత్యకేసులో సాక్షులను అనంతబాబు వాట్సాప్ వీడియోకాల్స్, సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా బెదిరించారు. అందుకే సెక్షన్ 308(5) కింద రిమాండ్ విధించాలి.
విచారణకు అసలు సహకరించలేదు
నిందితుడు అనంతబాబును అరెస్టు చేసి విచారించగా.. ఏమాత్రం సహకరించలేదుు. ఏమడిగినా తెలియదని బదులిచ్చారు. తదుపరి మరింత దర్యాప్తు జరగాలన్నా, ఇంకా ఆధారాలు సంపాదించాలన్నా.. అనంతబాబుకు రిమాండ్ విధించాలి. సాక్షులను బెదిరించి, డబ్బులివ్వడం ద్వారా హత్య కేసు నుంచి బయటపడేందుకు కుట్ర పన్నారు. ఇది తీవ్ర నేరం. ఇలాంటి తరుణంలో అనంతబాబు బయట ఉండడం సరికాదు. సాక్షులను ప్రభావితం చేశారని కేసు నమోదు చేసిన తర్వాత ఆయన పరారయ్యారు. మొత్తం ఆరు రకాల కారణాలను పరిగణనలోకి తీసుకుని ఆయనకు రిమాండ్ విధించాలి. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున అనంతబాబు ఇంకా బయటే ఉంటే డ్రైవర్ హత్యకేసుకు సంబంధించి మిగిలిన సాక్షులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. సాక్ష్యాలను కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది.