అనంతబాబుకు రిమాండ్
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:45 AM
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించి.. డబ్బులతో ప్రలోభపెట్టిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించింది.
కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశం
డ్రైవర్ హత్య కేసు సాక్షులను బెదిరించినట్లు ఆధారాలున్నాయ్: పోలీసులు
14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్
రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
కాకినాడ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సాక్షులను బెదిరించి.. డబ్బులతో ప్రలోభపెట్టిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. ఆయన్ను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు.. శనివారం ఉదయం 10.40 గంటలకు కాకినాడ రూరల్ పోలీసు స్టేషన్ నుంచి నేరుగా కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక 11.30 గంటలకు కాకినాడ జిల్లా కోర్టుల సముదాయంలోని స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఉషా లక్ష్మీకుమారి ముందు హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీలు రఘువీర్, విజయ బలంగా వాదనలు వినిపించారు. దళిత యువకుడు, తన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ఏ-1గా ఉన్నారని, ఆ కేసులో సాక్షులైన అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్‌కుమార్, ముమ్మిడి వెంకటేశ్‌ను ప్రలోభాలకు గురిచేయడం, తమకు అనుకూలంగా చెప్పకపోతే చంపేస్తామని బెదిరించడం, ఒకొక్కరికి డబ్బులు ఇస్తామని ఆశచూపడం వంటి చర్యలకు పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయని తెలిపారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే వారిని చంపేసి మృతదేహాలను పారేస్తానని కూడా హెచ్చరించారని పేర్కొన్నారు. అనంతబాబు తరఫున కాకినాడ నగర న్యాయవాదులు ఆదిత్యకుమార్, ముత్తింటి విశ్వేశ్వరరావు వాదనలు వినిపించారు.
మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటల వరకు వాదనలు సాగాయి. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న మేజిస్ట్రేట్.. సాక్షులను ప్రలోభపెట్టడం, నిర్బంధించడం, బెదిరించడం ప్రాథమిక దర్యాప్తులో రుజువు కావడం.. పోలీసులు ఆధారాలను రిమాండ్ రిపోర్టుతో కోర్టు ముందు ఉంచడంతో సెక్షన్ 308 (5) ప్రకారం అనంతబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. దీంతో అనంతబాబును పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. తొలుత కాకినాడ సబ్‌జైలుకు తీసుకెళ్లాలని భావించారు. అయితే భద్రత దృష్ట్యా రాజమహేంద్రవరం జైలు వైపు మొగ్గుచూపారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల అనంతరం బయటకు వచ్చిన అనంతబాబు పోలీసు వాహనం ఎక్కుతూ మీడియాతో మాట్లాడారు. కేసులో తనను అన్యాయంగా ఇరికించారని, వేధిస్తున్నారని.. సాక్షులను తాను బెదిరించలేదని తెలిపారు.
విచారణకు అనంతబాబు సహకరించలేదు..
విచారణలో అనంతబాబు ఏ మాత్రం సహకరించలేదని కేసు దర్యాప్తు అధికారి చెన్నకేశవరావు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం అనంతబాబును కాకినాడ తీసుకొచ్చామని.. సాక్షులను బెదిరించిన విషయమై పలు దఫాలుగా ప్రశ్నించినా ఉలుకూపలుకూ లేదని మీడియాకు తెలిపారు. సుమారు 30 ప్రశ్నలు అడిగితే ఐదింటికి మాత్రమే బదులిచ్చారని.. మిగిలిన వాటికి తెలియదు, సంబంధం లేదు, గుర్తులేదు, మరచిపోయా అంటూ ముక్తసరి సమాధానాలిచ్చారని చెప్పారు. ఫోన్ డేటా పరిశీలించేందుకు ప్రయత్నించగా పాస్‌వర్డ్ చెప్పేందుకు నిరాకరించారన్నారు.