అనంతబాబుకు కోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - May 23 , 2026 | 06:36 AM
డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది.
సాక్షులను ప్రభావితం చేసిన కేసులో బెయిల్ తిరస్కరణ
రాజమహేంద్రవరం, మే 22(ఆంధ్రజ్యోతి): డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చుక్కెదురైంది. సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరం కోర్టు నిరాకరించింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో మృతుడి స్నేహితులు అరవ మణికంఠ, అరవ శివ దుర్గాప్రసాద్ వాంగ్మూలాలను కోర్టు శుక్రవారం నమోదు చేసింది. సోమవారం నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు.. సాక్షులను ప్రభావితం చేసిన కేసులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం బెయిల్‌ను తిరస్కరిస్తూ ప్రధాన న్యాయాధికారి సునీత గంధం ఉత్తర్వులు ఇచ్చారు. సాక్షులను ప్రభావితం చేశారనే అభియోగంపై నమోదైన కేసు ఆధారంగా అనంతబాబుకు హత్య కేసులో బెయిల్‌ను ఇప్పటికే కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు రెండో కేసులో కూడా బెయిల్ తిరస్కరించడంతో అనంతబాబు జైలుకే పరిమితమయ్యారు. ఇదే కేసులో ఏ5గా ఉన్న న్యాయవాది ముందస్తు బెయిల్ అభ్యర్థనపై నిర్ణయాన్ని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.