రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:32 AM
అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని జాజరకల్లు క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.
అనంతపురం జిల్లా జాజరుకల్లు క్రాస్ వద్ద ప్రమాదం
బొమ్మనహాళ్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలంలోని జాజరకల్లు క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 15ఏపై టోల్‌ప్లాజా సమీపంలో లైమ్ స్టోన్‌తో వెళుతున్న ట్రక్కు ఎదురుగా వస్తున్న సిమెంట్ బల్కర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బల్కర్ డీజిల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగాయి. ట్రక్కు క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్ దీక్షిత్ (28) సజీవ దహనమయ్యాడు. పోలీసుల కథనం మేరకు, బెంగళూరు నుంచి లైమ్‌స్టోన్ లోడుతో బళ్లారి వైపు వెళుతున్న 16 చక్రాల భారీ ట్రక్కు.. బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న సిమెంట్ బల్కర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బల్కర్ డీజిల్ ట్యాంకు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ట్రక్కులో చిక్కుకున్న డ్రైవర్ దీక్షిత్ బయటకు వచ్చేందుకు సాధ్యంకాకపోవడంతో సజీవ దహనమయ్యాడు. సిమెంట్ బల్కర్ డ్రైవర్ వీరముత్తు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మృతుడు దీక్షిత్ కర్ణాటక రాష్ట్రం హిరియూరు ప్రాంతానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు.