Share News

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:47 AM

ఆ దంపతులకు ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఐదోసారి కొడుకు కోసం ప్రయత్నించగా.. ఈ సారి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు.

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

  • ఇప్పటికే నలుగురు కుమార్తెలు..

  • ఐదో సారి కొడుకు కోసం ప్రయత్నం ఈసారి ఇద్దరు కొడుకులు, కుమార్తె జననం

అనంతపురం వైద్యం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆ దంపతులకు ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఐదోసారి కొడుకు కోసం ప్రయత్నించగా.. ఈ సారి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఒక ఆడ, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. దీంతో ఐదుగురు ఆడపిల్లలు సహా మొత్తం సంతానం ఏడుకు పెరిగింది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నంజాపూరం గ్రామనికి చెందిన కవిత, రమేశ్‌లకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. తమకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఆ దంపతులకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు కావాలని ఐదో కాన్పు కోసం కూడా వారు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కవిత (36)ను గర్భం దాల్చగా పరీక్షించిన వైద్యులు.. ముగ్గురు శిశువులు ఉన్నట్టు గుర్తించారు. ప్రసవం సంక్లిష్టమవుతుందని భావించి.. వారిని అనంతపురం సర్వజన వైద్యశాలకు పంపించారు. గైనకాలజీ విభాగం డాక్టర్‌ సుచిత్ర ఆధ్వర్యంలో కవిత ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన వైద్యులు ఈ నెల 19న ఉదయం సిజేరియన్‌ చేసి నాలుగు నిమిషాల వ్యవధిలో ముగ్గురు శిశువులను బయటకు తీశారు. అనంతరం చిన్నారులను నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ)కు తరలించారు. ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించడంతో తల్లిపాలు చిన్నారులకు సరిపోలేదు. దీంతో సర్వజన వైద్యశాలలోని మదర్స్‌ మిల్క్‌బ్యాంక్‌ నుంచి ఇద్దరికి పాలు పడుతున్నారు. వీరిద్దరూ 1.7 కేజీల బరువు ఉండడంతో నాలుగు రోజులకే ఎస్‌ఎన్‌సీయూ నుంచి డిశార్జ్‌ చేసి తల్లికి అప్పగించారు. మరో చిన్నారి 1.4 కేజీల బరువు మాత్రమే ఉండటంతో ఎస్‌ఎన్‌సీయూలోనే వార్మర్‌లో ఉంచారు. ప్రస్తుతం తల్లి కూడా కోలుకున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి తెలిపారు.

Updated Date - Jan 29 , 2026 | 03:47 AM