ఉసురు తీసిన ఊయల
ABN , Publish Date - May 20 , 2026 | 04:11 AM
ఆసరాగా ఉండే చెట్టుకొమ్మే ఉరికొయ్యగా మారింది. ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి ఉసురు తీసింది.
చెట్టుకొమ్మ విరిగి పడి చిన్నారి మృతి
అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన
పుట్లూరు, మే 19(ఆంధ్రజ్యోతి): ఆసరాగా ఉండే చెట్టుకొమ్మే ఉరికొయ్యగా మారింది. ఊయలలో నిద్రిస్తున్న చిన్నారి ఉసురు తీసింది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లులో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరుకు చెందిన హేమలత, వంశీ దంపతులు తమ కుమారుడు శివకేశవ(14 నెలలు), బంధువులతో కలిసి కడవకల్లులోని పెద్దమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకునేందుకు సోమవారం రాత్రి వచ్చారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉన్న వేపచెట్టుకు ఊయల కట్టి శివకేశవను పడుకోబెట్టారు. అందరూ భోజనాలు చేస్తున్న సమయంలో హఠాత్తుగా.. చెట్టుకొమ్మ విరిగి ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిపై పడింది. కుటుంబ సభ్యులు పరుగున వెళ్లి చూసేసరికి శివకేశవ చనిపోయాడు. పోలీసులు చేరుకుని విచారించారు.