Share News

అనంతలో ఘోర ప్రమాదం

ABN , Publish Date - Aug 10 , 2026 | 04:26 AM

ఇరుకు వంతెనపై వ్యాన్‌ను ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపాన..

అనంతలో ఘోర ప్రమాదం

  • అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న వ్యాన్‌

  • ఓవర్‌ టేక్‌ చేస్తూ వ్యాన్‌ను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

  • వంతెనపై నుంచి రెండు వాహనాలూ వంకలోకి బోల్తా

  • 23 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

పామిడి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఇరుకు వంతెనపై వ్యాన్‌ను ట్రావెల్‌ బస్సు ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపాన 44వ జాతీయ రహదారి నీలూరు బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రెండు వాహనాలూ బ్రిడ్జిపై నుంచి కింద వంకలోకి పడిపోయాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పామిడి సీఐ శివశంకర్‌ నాయక్‌ కథనం మేరకు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు జిమ్‌ పరికరాల లోడుతో వ్యాన్‌ బయల్దేరింది. 35మంది ప్రయాణికులతో ‘నవంబర్‌ ట్రావెల్స్‌’ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. పొగరూరు గ్రామ సమీపాన నీలూరు బ్రిడ్జి వద్దకు రాగానే ముందు వెళ్తున్న వ్యాన్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో డ్రైవర్‌ ఒక్కసారిగా కుడివైపు వచ్చాడు. అదే సమయంలో వ్యాన్‌ను ఓవర్‌టేక్‌ చేస్తున్న ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. దీంతో వంతెన గోడను ఢీకొట్టి కింద వంకలోకి రెండు వాహనాలూ పడిపోయాయి. బస్సులోని 23 మంది గాయపడ్డారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్‌బాషా, వేణుగోపాలరావు పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్‌ మహమ్మద్‌ అజీజ్‌కు కాలు విరిగింది. వీరిని తొలుత అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి, తర్వాత బెంగళూరుకు తరలించారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ డ్రైవర్‌ పరారైనట్లు సీఐ తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 04:27 AM