అనంతలో ఉద్రిక్తత
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:00 AM
అనంతపురంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ హైటెన్షన్ నెలకొంది. మంత్రి నారా లోకేశ్ సహకారంతో ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, పరిటాల సునీత తన హత్యకు..
తన అవినీతిని నిరూపించాలంటూ తోపుదుర్తికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్
అందుకు గురువారమే డెడ్‌లైన్.. పోలీసులు అప్రమత్తం
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లకు భారీగా చేరుకున్న కార్యకర్తలు
తోపుదుర్తి, గోరంట్ల మాధవ్ అరెస్టు
అనంతపురం క్రైం, జూలై 9(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ హైటెన్షన్ నెలకొంది. మంత్రి నారా లోకేశ్ సహకారంతో ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, పరిటాల సునీత తన హత్యకు కుట్రపన్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఇటీవల ఆరోపించడంతో మొదలైన మాటల యుద్ధం.. పరస్పర దూషణల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలను గురువారంలోగా నిరూపించాలని, లేదంటే అతని ఇంటికి వెళ్లి చెప్పుతో కొడతానని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాలు విసిరారు. ఆ డెడ్‌లైన్ గురువారంతో ముగుస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం ఆదర్శనగర్‌లో ఉన్న ఎంఎస్ రాజు, శ్రీనగర్ కాలనీలో ఉన్న తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి ఇళ్లకు వెళ్లే రహదారులను దిగ్బంధించి, బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కూడళ్లు, ఇద్దరి నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా, ఇద్దరు నేతల ఇళ్లకు నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎంఎస్ రాజు ఇంటికి ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ బీకే పార్థసారథి, టీడీపీ ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు వెళ్లి మద్దతు తెలిపారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఇంటికి పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. తోపుదుర్తి ఇంట్లో భారీగా రాళ్లు, ఖాళీ బీరు బాటిళ్లను పోగేసుకోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అడ్డుకున్నారు. ఆయన రోడ్డుపై బైఠాయించడంతో అరెస్టు చేసి, పూచీకత్తుపై వదిలిపెట్టారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిని ఆయన ఇంటివద్ద అరెస్టు చేసి, ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తి (ఆయన స్వగ్రామం)కి తరలించారు.
అది రక్తపు కూడు కాదా..?
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విరుచుకుపడ్డారు. తన నివాసం వద్ద సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఇల్లు అమ్ముకుని ఎన్నికల్లో పోటీచేస్తానని 2019లో చెప్పిన తోపుదుర్తికి.. అనంతపురం, విజయవాడ, బాగేపల్లిలో ఆస్తులు ఎక్కడివని ప్రశ్నించారు. విజయవాడ నడిబొడ్డున కోట్ల విలువ చేసే భవనం రక్తపు కూడు కాదా? అని నిలదీశారు. అక్రమ ఆస్తులు కూడగట్టానని చేసిన ఆరోపణలకు ప్రకాశ్‌రెడ్డి సమాధానం చెప్పాలని సవాలు విసిరానని, సమాధానం చెప్పలేక రెచ్చగొట్టే చర్యలకు దిగడం సరికాదన్నారు.