Share News

ఆనంద్‌కు అదో ‘కిక్‌’

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:48 AM

ముసుగు వేసుకుని పెద్ద పెద్ద మాల్స్‌లో చోరీలు చేస్తున్న నాగరాజుగారి ఆనంద్‌(41) అనే వ్యక్తి అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఆనంద్‌కు అదో ‘కిక్‌’

  • మాల్స్‌లోనే చోరీలు

  • పేదలవైపు చూడని ముసుగు దొంగ

  • పలు రాష్ట్రాల్లో చోరీలు, 32 వరకూ కేసులు

  • అనంతలో బెంగళూరు వాసి అరెస్టు

  • రూ.5.25 లక్షలు, కారు స్వాధీనం

అనంతపురం క్రైం, జూలై 10(ఆంధ్రజ్యోతి): ముసుగు వేసుకుని పెద్ద పెద్ద మాల్స్‌లో చోరీలు చేస్తున్న నాగరాజుగారి ఆనంద్‌(41) అనే వ్యక్తి అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని చోర కథలు విని అవాక్కయ్యారు. ‘పేదల ఇళ్లవైపు చూడను సర్‌. పాపం వస్తుంది. కేవలం డబ్బున్నవారినే టార్గెట్‌ చేస్తాను. పెద్ద పెద్ద మాల్స్‌లో మాత్రమే చోరీలు చేస్తాను..’ అని చెబుతూ.. దొంగల్లోనూ నాలా మంచి దొంగలు ఉంటారు సర్‌ అన్నట్లు ఫేస్‌ పెట్టాడట. రవితేజ నటించిన కిక్‌ సినిమా తరహాలో చోరీలు చేసినా, హీరో తరహాలో ఎవరికీ పంచిపెట్టలేదు.. తన సొంతానికి వాడుకున్నాడు. అనంతపురం నగరంలోని డ్రెస్‌ సర్కిల్‌, శ్రీకాంచీపురం పీఎ్‌సఆర్‌ షాపింగ్‌ మాల్స్‌లో ఇటీవల చోరీలు జరిగాయి. ముఖం కనిపించకుండా ముసుగు, మాస్క్‌ ధరించిన వ్యక్తి చోరీలు చేసినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. ఈ కేసులను దర్యాప్తు చేసిన అనంతపురం వన్‌టౌన్‌, సీసీఎస్‌ పోలీసులు.. నిందితుడిని గుర్తించారు. అరెస్టు చేసి, శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ మహబూబ్‌ బాషా ఈ కేసుల వివరాలను మీడియాకు వివరించారు.


బెంగళూరువాసి..: బెంగళూరు నగరంలోని ఎంఆర్‌ఎస్‌ పాళ్యానికి చెందిన నాగరాజుగారి ఆనంద్‌, అక్కడే పూల వ్యాపారం ముసుగులో చోరీలకు పాల్పడేవాడు. అనంతపురంలోని డ్రెస్‌ సర్కిల్‌, శ్రీకాంచీపురం పీఎ్‌సఆర్‌ షాపింగ్‌ మాల్స్‌లోకి గత నెల 27వ తేదీన ముసుగు ధరించి వెళ్లి చోరీ చేశాడు. మాల్స్‌ పైభాగం నుంచి మెట్ల ద్వారా లోపలికి వెళ్లి, క్యాష్‌ కౌంటర్‌లను కొల్లగొట్టాడు. కేసు నమోదు చేసిన వన్‌టైన్‌ పోలీసులు దర్యాప్తులో చోరీలకు పాల్పడింది పాత నేరస్థుడు ఆనంద్‌ అని గుర్తించారు. అనంతపురంలో శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 5.25 లక్షల నగదు, మారుతీ కారు, 3 స్రూడ్రైవర్లు, 2 కట్టర్లు, 4 స్పానర్లు, ఒక కటింగ్‌ ప్లేయర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సినిమా పిచ్చితో..

సినిమా పిచ్చోడైన ఆనంద్‌.. దొంగతనాలనూ అదే తరహాలో చేశాడు. తమ కుమారుడు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అతని తల్లిదండ్రులు, మంచిమార్గంలో పెట్టాలని చూశారు. ఆస్తులను అమ్మి సుమారు రూ.2 కోట్ల వరకూ అతడికి ఇచ్చారు. ఆ డబ్బుతో ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నించాడు. సుమారు 40 రోజుల పాటు సినిమా షూటింగ్‌ చేశాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో తన కుటుంబంలో జరిగిన ఓ హత్యోదంతంలో జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాక ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆనంద్‌పై వివిధ రాష్ట్రాల్లో 32 కేసులు ఉన్నాయి. డబ్బు కోసం చోరీలను వృత్తిగా మార్చుకున్న ఆనంద్‌, చిన్నాచితక పనులు చేసుకుని జీవించే సామాన్యుల జోలికి మాత్రం వెళ్లడట. ‘పేదల ఇళ్లలో చోరీలు చేయడం పాపం కదా సర్‌..! బిగ్‌ షాట్స్‌ను మాత్రమే టార్గెట్‌ చేస్తాను’ అని పోలీసుల విచారణలో ఆనంద్‌ చెప్పాడట.

Updated Date - Jul 11 , 2026 | 05:49 AM