హనీట్రాప్ కేసులో సంచలనం సీఐ, ముగ్గురు పోలీసులు డిస్మిస్
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:05 AM
అనంతపురం జిల్లాలో ప్రకంపనలు రేపిన హనీట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్
మరో సీఐ కర్నూలు డీఐజీకి అటాచ్
అనంతపురం క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో ప్రకంపనలు రేపిన హనీట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పోలీసు శాఖలో దుమారం రేపిన ఈ కేసులో సీఐ, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించారు. ఎస్‌ఐ, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఒక సీఐని డీఐజీకి అటాచ్ చేశారు. ఆదివారం రాత్రి అనంతపురం రేంజ్ ఐజీ, కర్నూలు రేంజ్ డీఐజీ, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలానాయక్‌ను సర్వీసు నుంచి తొలగించారు. అనంతపురం రూరల్ ఎస్‌ఐ రాంబాబు, అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాంనాయక్‌ను సస్పెండ్ చేశారు. అనంతపురం రూరల్ సీఐ శేఖర్‌ను కర్నూలు రేంజ్ డీఐజీకి అటాచ్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఐదుగురు నిందితులను రిమాండ్‌కు పంపారు. నిందితుల నుంచి రూ.13 లక్షలు, 2 కత్తులు, 6 సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. ఇంకా కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హనీట్రాప్ ముఠాతో పోలీసులకు సంబంధాలు ఉండడాన్ని అనంతపురం డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీశ్ తీవ్రంగా పరిగణించారు. కఠిన చర్యలు తీసుకునేలా దర్యాప్తునకు దిగారు. ఈ క్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరితో ప్రత్యేకంగా దర్యాప్తు చేయించారు. ఈ క్రమంలో తొలి విడతలో ఇద్దరు సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్‌ను వీఆర్‌కు పంపారు. భారీస్థాయిలో బాధితులు రావడం, ముఖ్యంగా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉండటంతో పాటు అక్రమాలు నిర్ధారణ కావడంతో అనంతపురం డీఐజీ, ఎస్పీ చర్యలకు ఉపక్రమించారు. హనీట్రాప్ కేసులో ఇప్పటి వరకూ మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు చేశారు.