Share News

ఎడారీకరణ.. నియంత్రణ..!

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:37 AM

కరువుకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయి. కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాలలోని వేదవతి హగరి నది పరీవాహక ప్రాంతంలో ...

ఎడారీకరణ.. నియంత్రణ..!

  • అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగుతో ఇసుక మేటల విస్తరణ కట్టడి

  • కుంటల నిర్మాణాలతో భూగర్భ జలాల పెంపు

  • కరువు కట్టడికి జల సంరక్షణ చర్యలు

  • మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకం

  • ‘మన్‌కీ బాత్‌’లో ప్రస్తావించిన ప్రధాని

రాయదుర్గం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): కరువుకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయి. కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాలలోని వేదవతి హగరి నది పరీవాహక ప్రాంతంలో విస్తరిస్తున్న ఇసుక మేటలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ ప్రభావంతో ఓవైపు భూగర్భజలాలు అడుగంటిపోతుండగా.. మరోవైపు సారవంతమైన భూములు చౌడుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా అధికారులతో పాటు ప్రజలు చేపడుతున్న చర్యలతో పరిస్థితులు మెరుగవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉద్యాన పంటల సాగు, జిల్లాలో ఎడారీకరణను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నీటి కుంటల నిర్మాణాలతో భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం లాంటి అంశాల గురించి ప్రధాని మోదీ ఆదివారం తన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక మేటలను నియంత్రించేందుకు నీటి యాజమాన్య సంస్థ, అటవీ శాఖ చేస్తున్న కృషి గురించి వివరించారు. భూగర్భ జలాల పెంపుతో పాటు వర్షం నీటి నిల్వ కేంద్రాలను పెంచుకోవడంపై అభినందించారు.

ఇసుక తరలింపునకు చర్యలు

కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో 4 వేల ఎకరాలకుపైగా ఇసుక మేటలు విస్తరించాయి. ఏటా పడమటి వైపు నుంచి వీచే గాలులతో తూర్పు వైపున ఇసుక మేటలు విస్తరించి సాగు భూములను కప్పేస్తున్నాయి. రైతులు పంటలు పండించలేక బీడు భూములుగా వదిలేస్తున్నారు. ఇసుక విస్తరణను నియంత్రించేందుకు 22 గ్రామాల ప్రజలు ఏటా నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇసుక మే టల నియంత్రణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు చేపట్టారు. నల్ల రేగడి పొలాల్లో నీటిని నిల్వ చేసుకునేందుకు ఇసుక దోహదపడుతుందని రైతులు భావించడంతో ఇసుక తరలింపునకు 2014 నుంచి అనుమతించారు. ప్రభుత్వం డ్వా మా ఆధ్వర్యంలో రైతులకు చేయూతనందిస్తోంది.

Untitled-3 copy.jpg


మొక్కల పెంపకంతో కట్టడి

ఉద్యాన పంటల సాగుతో ఇసుక మేటల విస్తరణ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వ బృందం జిల్లాలో పర్యటించి, ప్రభుత్వానికి ఓ నివేదిక అందించింది. ఇసుక మేటలు విస్తరణను కట్టడి చేసేందుకు పరీవాహక ప్రాంతంలో మొక్కలు పెంచాలని సూచించింది. ఆ మేరకు మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు తక్కువ సమయంలో ఎక్కువ ఎదుగుదల పొందేలా మియావాకీ పద్ధతి దోహదపడుతుంది. అటవీ, నీటి సంరక్షణ శాఖల ఆధ్వర్యంలో పరీవాహక ప్రాంతంలో గోరింటాకు, సరుగుడు లాంటి మొక్కలతోపాటు ఇసుకపై అల్లుకుపోయే మొక్కలను నాటి ఇసుక మేటల విస్తరణను కట్టడి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.60 కోట్ల దాకా నిధులను మంజూరు చేసి, చర్యలను వేగవంతంగా చేశాయి.

సపోటా సాగుతో కొంతమేర నియంత్రణ

ఉద్యాన పంటల సాగు తో పొలంలో ఇసుక విస్తరణను కట్టడి చేయవచ్చనే అధికారుల సూచనతో ఏడేళ్ల క్రితం సపోటా సా గు చేశా. ఇప్పుడు అధిక దిగుబడి ఇస్తోంది. ప్రభుత్వ మే బోరు వేయించి, డ్రిప్‌ సౌకర్యం కల్పిస్తోంది. పంట సాగుతో ఇసుక బాగా తగ్గిపోయింది.

- తిప్పేస్వామి, దర్గాహొన్నూరు,

బొమ్మనహాళ్‌ మండలం

Updated Date - Jan 26 , 2026 | 03:39 AM