Share News

రాక్రీట్‌ అవినీతి సొమ్ము రికవరీకి చర్యలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:48 AM

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడి సంస్థ రాక్రీట్‌పై చర్యలకు అనంతపురం కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

రాక్రీట్‌ అవినీతి సొమ్ము రికవరీకి చర్యలు

  • 2.64 కోట్ల వసూలుకు అనంత కలెక్టర్‌ ఆదేశాలు

  • ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై చట్టపరమైన చర్యలు

అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో అవినీతికి, అవకతవకలకు పాల్పడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడి సంస్థ రాక్రీట్‌పై చర్యలకు అనంతపురం కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. చేసిన పనికి మించి నిధులు డ్రా చేసిన ‘రాక్రీట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నుంచి అదనపు సొమ్మును రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. అలాగే ఆ సంస్థకు అదనపు లబ్ధి చేకూర్చిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖల అధిపతులకు సిఫారసు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 50 వేలకు పైగా పేదల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును ‘రాక్రీట్‌’ దక్కించుకుంది. చేసిన పనిని మించి నిధులు తీసుకున్నట్లు విజిలెన్స్‌ గతంలోనే నిర్ధారించింది. సంస్థ నుంచి రూ.80.53 కోట్లకు పైగా అదనపు సొమ్మును రికవరీ చే యాలని సిఫారసు చేసింది. ఆ మేరకు రాక్రీట్‌ సంస్థ నుంచి అదనపు సొమ్మును రికవరీ చేయడంతోపాటు బాధ్యులైన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఆయా జిల్లాల కలెక్టర్లకు మార్చిలో లేఖలు రాశారు.


దానిపై స్పందించిన అనంతపురం జిల్లా కలెక్టరు ఆనంద్‌... రాక్రీట్‌కు అదనంగా చెల్లించిన రూ.2.64 కోట్లకు పైగా సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద రికవరీ చేయాలని, ఆ సంస్థపై సివిల్‌, క్రమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా హౌసింగ్‌ పీడీ, పంచాయతీరాజ్‌, పబ్లిక్‌ హెల్త్‌ విభాగాల ఎస్‌ఈలకు కలెక్టరు 18న లేఖ రాశారు. అవకతవకలకు పాల్పడిన రాక్రీట్‌ సంస్థకు సహకరించినందుకు అనంతపురం జిల్లాలో ఇద్దరు ఔట్‌ సోర్సింగ్‌ హౌసింగ్‌ మండల ఇన్‌చార్జిలు, ప్రస్తుతం పని చేస్తున్న 14 మంది ఉద్యోగులు, ఒక విశ్రాంత ఉద్యోగి, 19 మంది ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. మరో 15 మంది వార్డ్‌ ఎమినిటీస్‌ సెక్రటరీలపై చర్యలకు ఆదేశించారు. రూ.91,410 విలువైన సిమెంటు భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత ఉద్యోగుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు.

Updated Date - Jun 21 , 2026 | 04:49 AM