ఏటీఎంను ఎత్తుకుపోయారు
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:27 AM
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం కేంద్రంలోని మెషీన్‌ను దొంగలు అపహరించారు. అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారి పక్కనే, పోలీసుస్టేషన్ సమీపంలోనే ఎస్‌బీఐ ఏటీఏం ఉంది.
తాడు కట్టి.. ఊడబెరికి.. ఎత్తుకెళ్లిన దుండగులు.. అనంతపురం జిల్లాలో ఘటన
రూ.16 లక్షలు అపహరణ.. అంతా ఏడు నిమిషాల్లోనే..
బుక్కరాయసముద్రం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఏటీఎం కేంద్రంలోని మెషీన్‌ను దొంగలు అపహరించారు. అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారి పక్కనే, పోలీసుస్టేషన్ సమీపంలోనే ఎస్‌బీఐ ఏటీఏం ఉంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముసుగులు ధరించిన నలుగురు దుండగులు మినీ వ్యాన్‌లో వచ్చారు. ఏటీఎం మెషీన్‌ను బద్దలుగొట్టి నగదు అపహరించేందుకు యత్నించి విఫలమయ్యారు. దీంతో మెషీన్‌కు తాళ్లు కట్టి మినీ వ్యాన్‌కు బిగించి, బలంగా లాగారు. ఏటీఎం యంత్రం ఊడిపోయి, బయట ఉన్న అద్దాలు పగిలిపోయా యి. అనంతరం మెషీన్‌ను వాహనంలోకి ఎక్కిం చి ఉడాయించారు. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం చోరీ ఏడు నిముషాల్లోపే పూర్తయినట్లు తెలుస్తోంది. ఏటీఏం మెషీన్‌ను శింగనమల మండలంలోని ఆకులేడు పొలాల్లో బద్దలు కొట్టి డబ్బులు తీసుకున్నారు. ఆపై పెట్రోల్ పోసి, మెషీన్‌ను తగులబెట్టారు. ఏటీఎంలో రూ.15.84 లక్షలు దొంగలు అపహరించినట్లు పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసు విచారణలో.. ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ కెమెరాలు పది రోజులుగా పనిచేయడం లేదని తెలిసింది. చోరీకి గురైన ఏటీఎం కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇదే తరహా చోరీలు ఉమ్మడి అనంత జిల్లాలోని గుంతకల్లు, ధర్మవరం పట్టణాలతోపాటు తెలంగాణలోని షాద్‌నగర్, మహబూబ్‌నగర్‌లో జరిగినట్లు సమాచారం ఉందన్నారు. తెలంగాణ పోలీసులతో మాట్లాడి నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేస్తామని ఎస్పీ వివరించారు.