ఒకే రోజు 17 కోట్ల బిల్లుల చెల్లింపు
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:06 AM
అనంతపురం నగరపాలక సంస్థ కొన్ని గంటల వ్యవధిలోనే కాంట్రాక్టర్లకు రూ.17 కోట్ల మేర బిల్లులను చెల్లించింది.
అనంతపురం నగరపాలక సంస్థ చరిత్రలో రికార్డు
ప్రభుత్వానికి ఏఎంసీ కాంట్రాక్టర్ల సంఘం కృతజ్ఞతలు
అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అనంతపురం నగరపాలక సంస్థ కొన్ని గంటల వ్యవధిలోనే కాంట్రాక్టర్లకు రూ.17 కోట్ల మేర బిల్లులను చెల్లించింది. ఇందులో గత వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.8 కోట్లు (స్పెషల్ గ్రాంట్ రూ.3 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.5 కోట్లు, గడప గడపకు పథకం బిల్లులు రూ.1.5 కోట్లు) ఉన్నాయి. ఇవి కాకుండా రోడ్లు, మురుగు నీటి కాలువల నిర్మాణం, డీజిల్, వీధి లైట్లు, చెత్త తరలింపు, ఆఫీస్ నిర్వహణ తదితర బిల్లులకు సంబంధించి రూ.9 కోట్లను కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి జమచేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకూ డబ్బులు జమ అయ్యాయి. 2-3 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను టీడీపీ కూటమి ప్రభుత్వం క్లియర్ చేయడంతో కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏకకాలంలో రూ.17 కోట్ల పెండింగ్ పనుల బిల్లులను చెల్లించడం నగరపాలక సంస్థలో రికార్డు అని ఏఎంసీ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు సరిపూటి శ్రీకాంత్ అన్నారు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, మున్సిపల్ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చొరవతోనే పెండింగ్ బిల్లులు మంజూరు అయ్యాయన్నారు.