అనంత అడ్డదారి!
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:46 AM
‘సాక్షులను ప్రలోభాలకు గురి చేయరాదు. సాక్షులను బెదిరించరాదు’... ఈ షరతులతోనే నిందితులకు న్యాయస్థానం బెయిలు ఇస్తుంది. కానీ... దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు...
దళిత డ్రైవర్ హత్య కేసులో సంచలన మలుపు
ఎమ్మెల్సీ తరఫున రంగంలోకి అనుచరులు
నలుగురు సాక్షులను పిలిపించి మంతనాలు
డిఫెన్స్ లాయర్ చెప్పినట్లు వినాలని బెదిరింపులు
తలో రూ.3 లక్షలు ఇస్తామని ప్రలోభాలు
అప్పటికప్పుడు రూ.లక్ష చొప్పున అందజేత
పోలీసులకు సమాచారమిచ్చిన డ్రైవర్ సోదరుడు
సాక్షుల ఫిర్యాదుతో అనంతబాబు, ఇతరులపై కేసు నమోదు.. పరారీలో ఎమ్మెల్సీ
నిందితుల్లో వైసీపీ బీసీ సెల్ కార్యదర్శి చిన్నబాబు
(అమరావతి/కాకినాడ - ఆంధ్రజ్యోతి)
‘సాక్షులను ప్రలోభాలకు గురి చేయరాదు. సాక్షులను బెదిరించరాదు’... ఈ షరతులతోనే నిందితులకు న్యాయస్థానం బెయిలు ఇస్తుంది. కానీ... దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ రెండు షరతులనూ ఉల్లంఘించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బరితెగించారు. లక్షల రూపాయలు వెదజల్లి సాక్షులను కొనేసేందుకు పకడ్బందీగా ప్రణాళిక వేశారు. అయితే... సుబ్రమణ్యం సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఈ గుట్టు రట్టయింది. అనంతబాబుపై ఇప్పుడు మరో కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగడంతో... ఆయన పరారయ్యారు. వైసీపీ హయాంలో అత్యంత సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను విచారించేందుకు ఈ నెల 24న న్యాయమూర్తి తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కేసు సంచలన మలుపు తి రిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...
సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలు
ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమ ణ్యం హత్య కేసు నుంచి బయటపడేలా సాక్షులను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రణాళిక లు రచించారు. దీనికోసం అనంతబాబు తరఫు న ఆయన ప్రధాన అనుచరులైన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కడియాల చిన్నబాబు, ఆయన కుమారుడు సతీశ్, మాగంటి రాంబాబు రంగంలోకి దిగారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న డ్రైవర్ సుబ్రమణ్యం మిత్రులు అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేశ్‌లను సోమవారం రాత్రి కాకినాడ జేఎన్‌టీయూ వెనుక ఉన్న సిద్ధార్థ నగర్‌లో ఉన్న సమీరా రెసిడెన్సీకి రప్పించి బెదిరించారు. ప్రలోభాలకు గురి చేశారు. మృతుడు సుబ్రమణ్యం సోదరుడు ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దుర్గా శివప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వీరు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. అనంతబాబు అనుచరులు తమకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇస్తామన్నారని... అందులో భాగంగా సోమవారం తలో రూ.లక్ష అడ్వాన్సుగా ఇచ్చారని తెలిపారు. ‘‘కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు పాత స్టేట్‌మెంట్లను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అయితే... డిఫెన్స్ లాయర్లు చెప్పిన విధంగా కొన్ని అదనపు అంశాలను చేర్చండి. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు, లాయర్లందరినీ మేనేజ్ చేశాం’’ అని తమకు చెప్పారన్నారు. అనంతబాబు అనుచరులు ఇచ్చిన నగదును వీరు పోలీసులకు అప్పగించారు.
పోలీసులకు ఫిర్యాదు...: అనంతబాబు అనుచరుల బెదిరింపులు, ప్రలోభాలపై దుర్గాశివప్రసాద్, మణికంఠ, వెంకటేశ్, పవన్‌లు మంగళవారం సర్పవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు, ఆయన భార్య పాత్ర.. హత్య చేసిన తీరుపై మేం ప్రాసిక్యూషన్‌కు ఆధారాలు అందిం చాం. ఇప్పుడు తప్పుడు సాక్ష్యం చెప్పాలని అనంతబాబు మనుషులు బెదిరించారు. ఒక్కొక్కరికీ రూ.లక్ష ఇచ్చారు. వాళ్లు ఏం చేస్తారో అనే భయంతోనే ఆ డబ్బు తీసుకున్నాం.’’ అని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనంతబాబును ఏ1గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. మంగళవారం మాగంటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు.
అనంతబాబు పరార్: హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించా రు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు మంగళవారం రాత్రి కాకినాడలో ఆయన నివసిస్తున్న శంకర్ టవర్స్‌కు వెళ్లారు. ముగ్గురు సీఐలు అనంతబాబు ఫ్లాట్‌లోకి వెళ్లి తనిఖీలు చేశారు. సోదాల్లో రూ.12లక్షల నగదు గుర్తించారు. అరెస్టు సమాచారం ముందే లీకవడంతో అనంతబాబు తన అపార్టుమెంటు నుంచి మంగళవారం సాయంత్రం 6.30గంటలకు బైక్‌పై పారిపోయినట్టు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.