అనంతబాబుపై కేసులో నేటి నుంచి విచారణ
ABN , Publish Date - May 20 , 2026 | 04:14 AM
డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యపై రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టులో బుధవారం విచారణ ప్రారంభం కానుంది.
ప్రధాన సాక్షుల హాజరుకు ఇప్పటికే ఆదేశాలు
రాజమహేంద్రవరం, మే 19(ఆంధ్రజ్యోతి): డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్యపై రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టులో బుధవారం విచారణ ప్రారంభం కానుంది. నిందితులు పరారీ కావడం, అరెస్టులు, చార్జిషీట్లు, రిమాండ్, బెయిల్, సాక్షులకు బెదిరింపు లు.. మళ్లీ అనంతబాబు అరెస్టు.. ఇప్పటివరకు కేసు ప్రక్రియ వీటికే పరిమితమైంది. బుధవారం నుంచి వేగంగా విచారణ కొనసాగనుంది. 20న ప్రధాన సాక్షులైన సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం, తండ్రి సత్యనారాయణ.. 21న సుబ్రహ్మణ్యం సోదరుడు నవీన్, వీధి అపర్ణ.. 22న ఇద్దరు సాక్షులు, 25న నలుగురు, 26న ఇద్దరు చొప్పున విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశించింది. అప్పుడే క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ కేసులో మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారు. ఇక సాక్షులను బెదిరించి ప్రలోభాలకు గురిచేసిన కేసులో అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా బుధవారం న్యాయాధికారి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. సాక్షులను బెదిరించడం ద్వారా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగంతో నమోదైన కేసులో అనంతబాబుకు ఈ నెల 13న కోర్టు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు.