గురుకుల పాఠశాలల్లో ‘అనంత అరణ్య’
ABN , Publish Date - May 23 , 2026 | 05:47 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల పెంపకం పద్ధతికి..
ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోనూ మొక్కల పెంపకంతో సూక్ష్మ అడవుల అభివృద్ధి
పావు ఎకరంలో 1625 మొక్కల ప్లాంటేషన్
ఉపాధి నిధులతో 1089 పాఠశాలల్లో అమలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు
రెండేళ్లలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంప్‌సలే లక్ష్యం
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల పెంపకం పద్ధతికి సంబంధించిన అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ ‘అనంత అరణ్య’ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1089 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో ఉపాధి హామీ పథకం నిధులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ సాంకేతిక సహకారం అందించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ మార్గదర్శకాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను రెండేళ్లలో నెట్ జీరో అండ్ హెల్తీ క్యాంప్‌సలుగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో 0.25 ఎకరాల విస్తీర్ణంలో సాంధ్ర అటవీకరణ (పరిమిత స్థలంలో ఎక్కువ మొక్కలను నాటి, తక్కువ సమయంలో సహజ సిద్ధమైన అడవులను సృష్టించే పద్ధతి) చేపట్టనున్నారు. భూమి ఎక్కువగా అందుబాటులో ఉంటే ఒకే ప్రాంగణంలో బహుళ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.
1625 మొక్కలతో సూక్ష్మ అడవి
అనంత అరణ్య విధానంలో సహజ అటవీ వ్యవస్థను అనుకరించి ఏడు స్థాయిల మొక్కల పెంపకాన్ని చేపడతారు. పెద్ద చెట్లు, మధ్యస్థ చెట్లు, చిన్న చెట్లు, పొదలు, ఔషధ మొక్కలు, నేలమట్టపు కవర్ మొక్కలు తదితరాలు కలిపి మొత్తం 1625 మొక్కలను 0.25 ఎకరంలో నాటనున్నారు. ప్రతి 0.25 ఎకరా యూనిట్‌కు సుమారు రూ.5 లక్షల వ్యయం అంచనా వేశారు. ఇందులో లేబర్ కాంపోనెంట్ రూ.1.80 లక్షలు, మెటీరియల్ కాంపోనెంట్‌కు రూ.3.20 లక్షలు వ్యయం చేస్తారు. ఉపాధి నిధుల నుంచి మూడు సంవత్సరాల నిర్వహణ వ్యయం అందిస్తారు. మొదటి సంవత్సరంలో నీటి పారుదల, కలుపు తొలగింపు, సేంద్రీయ ఎరువులు, వ్యాధి నివారణ వంటి పనులు చేపడతారు. రెండు, మూడో సంవత్సరాల్లో ప్రధానంగా పర్యవేక్షణ, నీటి పంపిణీ పనులు కొనసాగిస్తారు. అవసరమైతే మొక్కలకు నీటి సరఫరా కోసం ఉపాధి పథకం కింద ప్రత్యేకంగా ఫారం పాండ్లు కూడా తవ్వొచ్చని ప్రభుత్వం తెలిలపింది. అలాగే రెయిన్ గన్‌లతో కూడిన ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అనుమతించారు.