వైసీపీ పాపాలు పండాయ్!
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:27 AM
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులకు చట్టపరంగా శిక్ష తప్పదని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ బాధ్యులకు శిక్ష తప్పదు: ఆనం
ప్రసాదంలో కల్తీ నెయ్యి వాస్తవం
నాటి టీటీడీ చైర్మన్లు వైవీ, భూమన ఒప్పుకోలు
హిందూ మత విధ్వంసానికి జగన్ అండ్ కో కుట్ర
11 సీట్లకు పడ్డా బుద్ధి రాలేదు.. మండలిలో ఆనం
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులకు చట్టపరంగా శిక్ష తప్పదని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసి.. టీటీడీపై జగన్ అండ్ కో విషం చిమ్మారని, మహాపాపం, అపచారం చేశారని ఽధ్వజమెత్తారు. వైసీపీ నేతల పాపాలు పండాయని, తప్పు చేసినవారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. గురువారం శాసన మండలిలో ’టీటీడీ పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం’పై ఆయన వివరణ ఇస్తూ.. భావోద్వేగంతో మాట్లాడారు. ‘హిందూమతం విధ్వంసానికి జగన్ అండ్ కో కుట్ర చేసింది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి, తిరుమల క్షేత్రానికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత అపవిత్రం చేసినా శ్రీవారి మహత్యాన్ని ఎవరూ అడ్డుకోలేరు. హిందూధర్మానికి, తిరుమలకు వ్యతిరేకంగా కుట్రలు చేసినందునే 11కి దిగారు. ఇంకా వీళ్లకి బుద్ధిరావట్లేదు. నాటి సీఎం జగన్ తిరుమల పట్ల చేసిన పాపాలే వైసీపీకి శాపాలుగా మారాయి. 2020లో 371 తీర్మానంతో నెయ్యి టెండర్ల నిబంధనలు మార్చారు. 2022లో వాళ్లు ప్రోత్సహించిన భోలేబాబా సంస్థ విచారణ ఎదుర్కొంటోంది. 2022లోనే తిరుమల లడ్డూల్లో అనేక మిశ్రమ పదార్థాలున్నాయని సీఎఫ్‌టీఆర్‌ఐ తేల్చింది. ఈ రిపోర్టును నాడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, అధికారులు తొక్కిపెట్టారు. 2024లో ఎన్‌డీడీబీ-కాఫ్ రిపోర్టు వచ్చింది.
ఫిష్ ఆయిల్, జంతుకొవ్వు మిశ్రమాలు కలిపిన నెయ్యి వాడారని తేలింది. రిపోర్టులన్నీ ఉన్నాయి. వాస్తవాలను గుర్తించడానికి వీళ్లు ముందుకు రావట్లేదు. సీబీఐ చార్జిషీటులో 36మందిని నిందితులుగా చేర్చింది. కల్తీ జరిగిన మాట వాస్తవమేనని నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తర్వాత వచ్చిన భూమున చెప్పారు. వాళ్లే ఒప్పుకొన్న తర్వాత వీళ్లు (వైసీపీ సభ్యులు) ఎందుకు మాట్లాడుతున్నారు’ అని ఆనం విరుచుకుపడ్డారు. హిందూ మత విధ్వంసానికి కుట్ర జరిగిందనడానికి అనేక ఆధారాలున్నాయని చెప్పారు.