ఏసీబీ వలలో గనుల శాఖ సర్వేయర్
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:01 AM
గనుల శాఖ అనకాపల్లి జిల్లా కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న డి.మురళీకృష్ణ అంబేడ్కర్ గురువారం రూ.ఐదు లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
క్వారీ మంజూరుకు రూ.15 లక్షలు డిమాండ్
రూ.ఐదు లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
అనకాపల్లి టౌన్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గనుల శాఖ అనకాపల్లి జిల్లా కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న డి.మురళీకృష్ణ అంబేడ్కర్ గురువారం రూ.ఐదు లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ ఎస్.ఆర్.హర్షిత, డీఎస్పీ బీవీవీఎస్ రమణమూర్తి తెలిపిన వివరాలు...అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలోని కొత్తపేటకు చెందిన ఎస్.సునీల్‌కుమార్ ఊడేరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 211లో గల రెండు హెక్టార్లలో క్వారీ కోసం కొద్దిరోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు లీజుకు సంబంధించిన డబ్బులు చెల్లించారు. ఆ ఫైల్ సర్వేయర్ మురళీకృష్ణ వద్ద ఉంది. క్వారీ మంజూరు చేయాలంటే తనకు రూ.15 లక్షలు ఇవ్వాలని సునీల్‌కుమార్‌ను మురళీకృష్ణ డిమాండ్ చేశారు. అడ్వాన్స్‌గా రూ.ఐదు లక్షలు ఇస్తానని సునీల్‌కుమార్ చెప్పడంతో మురళీకృష్ణ అంగీకరించారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని సునీల్‌కుమార్ విశాఖలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం లో గురువారం ఉద యం సర్వేయర్ మురళీకృష్ణ అంబేడ్కర్‌కు సునీల్‌కుమార్ ఫోన్ చేయగా, కార్యాలయం దగ్గరకు రమ్మన్నారు. కార్యాలయం పక్కనున్న ఖాళీ ప్రదేశంలో సునీల్‌కుమార్ నుంచి మురళీకృష్ణ రూ.ఐదు లక్షలు లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ డీఎస్పీ బీవీవీఎస్ రమణమూర్తి, ఇతర అధికారులు, సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. సర్వేయర్‌ను శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. 2018లో కూడా సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ విశాఖ నగర పరిధిలో ఒకరి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని, ఆ కేసు కోర్టులో విచారణలో ఉందన్నారు.