30 వేలతో సోలార్ ఈ-బైక్
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:12 AM
పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపు చూస్తున్నాయి. వీటిపై ఎన్నో ప్రయోగాలతో...
అనకాపల్లి జిల్లా విద్యార్థి రూపకల్పన
ఎలమంచిలి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపు చూస్తున్నాయి. వీటిపై ఎన్నో ప్రయోగాలతో పాటు కొత్త ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి. ఆ స్ఫూర్తితో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి శేషుకొండ ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి తంగేటి గణేష్ విజయ సత్యసాయి బాలాజీ సోలార్ విద్యుత్‌తో నడిచే ఈ-బైక్‌ను రూపొందించాడు. అగనంపూడిలోని గొన్నా ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి బాలాజీ, తన ప్రాజెక్టులో భాగంగా స్నేహితులతో కలసి సోలార్ బైక్‌ను తయారుచేసినట్టు చెప్పాడు. ఈ హైబ్రిడ్ బైక్‌ను తయారు చేయడానికి సుమారు 14 రోజులు సమయం పట్టిందని, 30 వేలు ఖర్చయ్యిందని చెప్పాడు. 60 వాట్స్ సామర్థ్యం గల సోలార్ ప్యానల్, 20 ఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ, 24 వాట్స్ సామర్థ్యం గల డిసి గేర్ మోటార్‌లను ఉపయోగించామని తెలిపాడు. మూడు నుంచి 4 గంటలు చార్జింగ్ చేస్తే సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని, గంటకు 35 కిలోమీటర్ల వరకు వేగం అందుకుంటుందని చెప్పాడు.